ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ పోస్ట్‌ వైరల్

 ఎంపీ ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ పోస్ట్‌ వైరల్

డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని ఇలాంటివి చూసినప్పడే తెలుస్తుంది అంటున్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. డిజిటల్ పేమెంట్స్‌కి సంబంధించిన ఒక వీడియోని ట్విట్టర్‌‌లో పోస్ట్ చేసి తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. ఆ వీడియోకి ‘పెళ్ళిలో డిజిటల్ షగున్’ అని ట్యాగ్‌లైన్ పెట్టాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

భారత్‌లో భిక్షాటన చేసేవాళ్లు కూడా మెడలో క్యూ ఆర్‌‌కోడ్‌లు పెట్టుకొని భిక్షమెత్తుకుంటున్నారు. బఠానీల దగ్గరనుంచి బట్టలవరకు ఏది కొనాలన్నా డిజిటల్ పేమెంట్స్‌కే జనాలు ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నారు. అలాంటిదే ఎంపి అర్వింద్ పోస్ట్ చేసిన వీడియోకూడా. అందులో పెండ్లి బరాత్ జరుగుతుంటుంది. పెండ్లికి వచ్చిన బంధువుల్లో కొందరు డబ్బుల్ని దంపతుల చుట్టూ తిప్పుతూ బ్యాండ్‌ మేళం వాళ్లకి ఇస్తుంటారు. అయితే, చేతిలో చిల్లరలేని ఒకతను, తన ఫోన్‌లో డిజిటల్ పేమెంట్స్ యాప్‌లో క్యూఆర్ స్కానర్ తెరిచి దంపతులచుట్టూ తిప్పుతాడు. తర్వాత బ్యాండ్ మేళంవాళ్ల డోలుకు అంటించి ఉన్న క్యూఆర్‌‌ కోడ్‌ స్నాన్‌ చేసి పేమెంట్‌ చేస్తాడు. దీనిపై ట్విట్టర్‌‌లో చాలామంది రకరకాల కామెంట్స్ పెడుతున్నారు.