- ప్రతి కాలేజీ కార్పస్ ఫండ్ మెయింటేన్ చేయాలి
హైదరాబాద్, వెలుగు: దేశంలోని మెడికల్ కాలేజీలకు ఊరటనిస్తూ నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) కీలక ముసాయిదా విడుదల చేసింది. ఇప్పటికే నడుస్తున్న మెడికల్ కాలేజీల్లో కొత్తగా పీజీ కోర్సులు ప్రారంభించాలంటే.. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్(ఈసీ) తీస్కోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కొత్తగా స్థాపించే కాలేజీలకు మాత్రమే ఈసీ నిబంధన వర్తిస్తుందని పేర్కొంది. అలాగే, కాలేజీ కొత్తదైనా, పాతదైనా తప్పనిసరిగా కార్పస్ ఫండ్ నిర్వహించాలని, ఆ ఫండ్‌ను కాలేజీ నిర్వహణ కోసమే వాడాలని నిబంధన పెట్టింది.
యూనివర్సిటీ నుంచి పొందే కన్సెంట్ ఆఫ్ అఫిలియేషన్(సీవోఏ) దరఖాస్తు చేసేనాటికి వాలిడిటీ కలిగి ఉండాలని సూచించింది. కాలేజీలు సమర్పించే అప్లికేషన్లు అసంపూర్ణంగా ఉంటే.. ముందస్తు నోటీసు లేకుండానే రిజెక్ట్ చేస్తామని, సవరణలకు అవకాశం ఇవ్వబోమని తేల్చిచెప్పింది. ఈ ముసాయిదాపై అభ్యంతరాలు, సలహాలు మార్చి 18లోపు ఎన్‌ఎంసీకి మెయిల్ ద్వారా తెలియజేయాలని కోరింది.
