V6 News

మెడికల్ సీట్లపై రూల్స్ ఎత్తివేత..జనాభా నిష్పత్తి రూల్ రద్దు చేస్తూ ఎన్ఎంసీ నిర్ణయం

మెడికల్ సీట్లపై రూల్స్ ఎత్తివేత..జనాభా నిష్పత్తి రూల్ రద్దు చేస్తూ ఎన్ఎంసీ నిర్ణయం
  • 150 సీట్ల గరిష్ట పరిమితి నిబంధన ఎత్తివేత
  • 10 లక్షల జనాభాకు 100 సీట్ల రూల్ కూడా రద్దు
  • కాలేజీకి, హాస్పిటల్ కు దూరం 10 కిలోమీటర్లే ఉండాలి
  • రూల్స్​ను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల 

హైదరాబాద్, వెలుగు:  కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు, సీట్ల పెంపునకు అడ్డంకిగా మారిన రూల్స్ ను సవరిస్తూ ఎన్ఎంసీ గెజిట్ నోటిఫికేషన్  విడుదల చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలోని ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 100 ఎంబీబీఎస్ సీట్లు మాత్రమే ఉండాలనే పాత రూల్​ను ఎన్ఎంసీ పూర్తిగా రద్దు చేసింది. దీనివల్ల ఇప్పటికే ఎక్కువ సీట్లు ఉన్న తెలంగాణ, ఏపీ వంటి రాష్ట్రాల్లో మరిన్ని కొత్త కాలేజీలు రావడానికి, ఉన్న కాలేజీల్లో సీట్లు పెరగడానికి మార్గం సుగమమైంది.

గతంలో 2024-–25 విద్యా సంవత్సరం నుంచి సీట్లు పెంచుకోవాలనుకునే కాలేజీలకు ఉన్న 150 సీట్ల గరిష్ట పరిమితిని కూడా తాజా సవరణలో ఎన్ఎంసీ ఎత్తివేసింది. అంటే మౌలిక సదుపాయాలు ఉన్న కాలేజీలు తమ సామర్థ్యాన్ని బట్టి సీట్లను పెంచుకునే అవకాశం లభించింది. 

కాలేజీకి.. హాస్పిటల్ కు 10 కిమీ దూరం ఉండాలి  

మెడికల్ కాలేజీ, దానికి అనుబంధంగా ఉండే టీచింగ్ హాస్పిటల్ మధ్య ఉండాల్సిన దూరం విషయంలోనూ మార్పులు చేశారు. గతంలో కాలేజీకి, హాస్పిటల్ కు మధ్య ప్రయాణ సమయం గరిష్టంగా 30 నిమిషాలు ఉండాలనే రూల్ ఉండేది. ట్రాఫిక్ చిక్కుల వల్ల దీనిని లెక్కించడం కష్టమని భావించిన ఎన్ఎంసీ.. ఇకపై కాలేజీకి, హాస్పిటల్ కు మధ్య దూరం గరిష్టంగా 10 కిలోమీటర్లు మాత్రమే ఉండాలని స్పష్టం చేసింది. కొండ ప్రాంత రాష్ట్రాల్లో మాత్రం ఈ దూరాన్ని 15 కిలోమీటర్ల వరకు సడలించింది. వైద్య విద్యను సామాన్యులకు మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ రెడ్ టేపిజం నిబంధనలను తుడిచేస్తూ ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.