తెలంగాణలో 10 వేల 500 MBBS సీట్లు.. సర్కారీ కాలేజీల్లో 4,400..  ప్రైవేటు కాలేజీల్లో 6,100 సీట్లు

తెలంగాణలో 10 వేల 500 MBBS సీట్లు.. సర్కారీ కాలేజీల్లో 4,400..  ప్రైవేటు కాలేజీల్లో 6,100 సీట్లు
  • 36 సర్కారీ కాలేజీల్లో 4,400.. 
  • 30 ప్రైవేటు కాలేజీల్లో 6,100 సీట్లు
  • దేశవ్యాప్తంగా 839 కాలేజీలు.. మొత్తం 1,40,664 సీట్లు ఖరారు
  • ఫైనల్ సీట్ మ్యాట్రిక్స్ విడుదల చేసిన ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ

హైదరాబాద్, వెలుగు: దేశవ్యాప్తంగా 2026 –27 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్ సీట్ మ్యాట్రిక్స్‌‌‌‌‌‌‌‌ ను నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ) మంగళవారం విడుదల చేసింది. ఐఎన్‌‌‌‌‌‌‌‌ఐలు మినహాయించి మిగతా కాలేజీల సీట్ల వివరాలను ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 66 మెడికల్ కాలేజీలున్నాయి. ఇందులో 36 ప్రభుత్వ కాలేజీలు కాగా.. 30 ప్రైవేటు కాలేజీలు. వీటి ద్వారా మొత్తం 10,500 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయి.

గతంలో ప్రభుత్వ కాలేజీల్లోని 4,290 సీట్లు రెన్యూవల్ కాగా కొత్తగా నిజామాబాద్ (30), ఆదిలాబాద్ రిమ్స్ (30), మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్ (25), సిద్దిపేట (25)లో కాలేజీల్లో కలిసి110 సీట్లు పెరిగాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో సీట్ల సంఖ్య 4,400కు చేరింది. ఇక 30 ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో పాతవి 5,150 సీట్లు రెన్యూవల్ అయ్యాయి. అదనంగా మరో 950 సీట్లు పెరిగాయి.

కొత్తగా రాజరాజేశ్వరి మహిళా మెడికల్ కాలేజీకి 150 సీట్లు మంజూరయ్యాయి. మహేశ్వర (100), ఎంఎన్‌‌‌‌‌‌‌‌ఆర్ (100), ఎస్‌‌‌‌‌‌‌‌వీఎస్ (100), షాదాన్ (100) కాలేజీల్లో సీట్లు పెరిగాయి. భాస్కర్, పట్నం మహేందర్ రెడ్డి, మహావీర్, మల్లారెడ్డి, మల్లారెడ్డి ఉమెన్స్, మమత, మెడిసిటీ, టీఆర్‌‌‌‌‌‌‌‌ఆర్ కాలేజీల్లో 50 చొప్పున సీట్లు పెరిగాయి. దీంతో ప్రైవేటులో సీట్ల సంఖ్య 6,100కు చేరింది.

ఇక దేశవ్యాప్తంగా 839 మెడికల్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో 1,40,664 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు 64,121 కాగా, ప్రైవేటులో 76,543 సీట్లు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చిన 41 కాలేజీల ద్వారా 3,850 సీట్లు పెరిగాయి. అనుమతి పొందిన సీట్లలోనే ప్రవేశాలు కల్పించాలని ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ స్పష్టం చేసింది. పరిమితికి మించి అడ్మిషన్లు తీసుకుంటే ఎన్‌‌‌‌‌‌‌‌ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని కాలేజీలను హెచ్చరించింది.