లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తం.. ఊహించని ఫలితాలుంటాయ్ : కిషన్ రెడ్డి

లోక్‌సభ ఎన్నికల్లో  ఒంటరిగానే పోటీ చేస్తం..  ఊహించని ఫలితాలుంటాయ్  : కిషన్ రెడ్డి

జనసేనకు కటీఫ్ చెప్పేసింది బీజేపీ. లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి ఇవాళ జరిగిన ముఖ్యనేతల సమావేశంలో కుండ బద్దలు కొట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనతో కలిసి బీజేపీ పోటీ చేసింది. ఆ పార్టీకి ఎనిమిది స్థానాలను కేటాయించగా.. ఒక్క సెగ్మెంట్ లో కూడా జనసేన అభ్యర్థులకు కనీసం డిపాజిట్లు దక్కించుకునే ఓట్లు రాలేదు. దీంతో పొత్తుతో  పెద్దగా ప్రయోజనం లేకపోయిందని బీజేపీ డిసైడ్ అయ్యింది. 

అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యం

ఎంపీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుదామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ ముఖ్యనేతలకు పిలుపునిచ్చారు.  లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, సర్వే సంస్థల అంచనాలకు మించి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పారు. పార్లమెంటు ఎన్నికలకు సన్నద్దం చేయడంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెలాఖరున రాష్ట్రానికి వస్తారని చెప్పారు.

 రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ తో సమాంతరంగా బీజేపీ పోటీలో ఉంటుందని చెప్పారు. తెలంగాణలో రాజకీయంగా ఎదిగేందుకు బీజేపీకి మంచి అవకాశాలున్నాయని చెప్పారు.  రేపటి నుంచి తెలంగాణలో వికసిత్ భారత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని చెప్పారు. 

కొత్తగా ఎన్నికైన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల్లో పర్యటిస్తారని తెలిపారు. దేశంలో మూడో సారి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడబోతోందని చెప్పారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని, అన్ని కమిటీల నియామకాలను పూర్తి చేయాలని కిషన్ రెడ్డి ముఖ్యనేతలకు సూచించారు.