Paytm Pocket Money: డిజిటల్ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. బ్యాంక్ అకౌంట్ లేని టీనేజర్లు సైతం తమ సొంత మొబైల్ ఫోన్ల ద్వారా యూపీఐ పేమెంట్లు చేసుకునేలా ‘పేటీఎం పాకెట్ మనీ’ ఫీచర్‌ను మే 18న లాంచ్ చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2024 ఆగస్టులో ప్రవేశపెట్టిన ‘యూపీఐ సర్కిల్’ టెక్నాలజీ ఆధారంగా ఈ సేవలు పనిచేస్తాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా స్కూల్, కాలేజీ విద్యార్థులు క్యాష్ కోసం తల్లిదండ్రులపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. అలాగే ప్రతిదానికీ ఓటీపీలు అడగడం, వాట్సాప్‌లో క్యూఆర్ కోడ్‌లు పంపాల్సిన తలనొప్పులు ఇకపై ఉండబోవు.
ఈ ఫీచర్ టీనేజర్లకు స్వేచ్ఛను ఇవ్వడమే కాకుండా.. తల్లిదండ్రులకు పూర్తి నియంత్రణను అందిస్తుంది. పేరెంట్స్ తమ బ్యాంక్ అకౌంట్ ద్వారా పిల్లలకు నెలకు ఎంత ఖర్చు చేయాలో లిమిట్ సెట్ చేయవచ్చు ఇందులో. అలాగే పేటీఎం స్పెండ్ సమ్మరీ ఫీచర్ ద్వారా పిల్లలు ఎక్కడెక్కడ, దేనికోసం డబ్బులు ఎంత ఖర్చు చేస్తున్నారో రియల్ టైమ్‌లో ట్రాక్ చేయవచ్చు. దీనివల్ల పిల్లల్లో చిన్నతనం నుంచే బాధ్యతాయుతమైన మనీ హ్యాబిట్స్ అలవడుతాయి. ఈ పాకెట్ మనీ సేవలను సేవింగ్స్, కరెంట్ అకౌంట్లపై యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే దీని ద్వారా అంతర్జాతీయ పేమెంట్లు చేయడం, క్యాష్ విత్‌డ్రా చేసుకోవడం లాంటివి మాత్రం కుదరదు.
►ALSO READ | వామ్మో.. పెట్రోల్, డీజిల్ రేట్ల బాదుడు! లీటరుకు మరో రూ.25 పెరిగే ఛాన్స్
సేఫ్టీ పరంగా పేటీఎం ఇందులో కఠినమైన రూల్స్ పెట్టింది. ఒక సింగిల్ పేమెంట్ గరిష్టంగా రూ.5వేల వరకు మాత్రమే చేయొచ్చు. అలాగే నెలకు మొత్తం రూ.15వేలు పరిమితి ఉంటుంది. అంతేకాదు ఫీచర్ సెటప్ చేసిన మొదటి 30 నిమిషాల్లో కేవలం రూ.500 వరకు, మొదటి 24 గంటల్లో రూ.5వేల వరకు మాత్రమే ట్రాన్సాక్షన్లు జరిగేలా ఇన్‌బిల్ట్ సేఫ్టీ కంట్రోల్స్ ఉన్నాయి. ఈ సేవలను వినియోగించాలంటే మొబైల్ డివైజ్ లాక్ తప్పనిసరి. తల్లిదండ్రులు తమ పేటీఎం యూపీఐ పిన్ ఉపయోగించి ఎప్పుడైనా ఈ యాక్సెస్‌ను మార్చొచ్చు లేదంటే పూర్తిగా రద్దు చేయవచ్చు.
దీన్ని యాక్టివేట్ చేయడం చాలా ఈజీ. మొదట పేటీఎం యాప్‌ను లేటెస్ట్ వెర్షన్‌కి అప్‌డేట్ చేయాలి. యాప్ ఓపెన్ చేసి ‘టు మొబైల్- కాంటాక్ట్’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, అక్కడ ‘పాకెట్ మనీ’ ఆప్షన్ ని ఎంచుకోవాలి. ఆ తర్వాత పిల్లల కాంటాక్ట్ నంబర్ లేదా వారి యూపీఐ ఐడీని ఎంటర్ చేసి, అవసరమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. అనంతరం నెలకు ఎంత లిమిట్ పెట్టాలో సెలెక్ట్ చేసుకుని.. మీ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్‌ను ఎంచుకుని పేటీఎం యూపీఐ పిన్ ఎంటర్ చేయాలి. చివరిగా అవతలి వ్యక్తి ఫోన్‌కు వచ్చే ఇన్విటేషన్‌ను వారు యాక్సెప్ట్ చేస్తే పేటీఎం పాకెట్ మనీ యాక్టివేట్ అయిపోతుంది.
