భారత బ్యాంకింగ్ రంగంలో ఒక ఆసక్తికరమైన.. అదే సమయంలో ఆందోళన కలిగించే పరిస్థితి కనిపిస్తోంది. బ్యాంకుల నుంచి లోన్స్ తీసుకునే వారి సంఖ్య, రుణాల పరిమాణం వేగంగా పెరుగుతోంది. కానీ అదే స్థాయిలో ప్రజలు బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడం లేదు. ఫలితంగా బ్యాంకులు ఇచ్చే రుణాలు, వాటికి లభిస్తున్న డిపాజిట్ల మధ్య అంతరం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది బ్యాంకులపై నిధుల సమీకరణ ఒత్తిడిని పెంచేస్తోందని నిపుణులు అంటున్నారు.
రికార్డు స్థాయిలో అప్పులు..
2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయ బ్యాంకులు రుణాల విషయంలో భారీ వృద్ధిని నమోదు చేశాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్లోబల్ అడ్వాన్సుల్లో దాదాపు 28.8 శాతం వృద్ధితో అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ 27 శాతం, ధనలక్ష్మీ బ్యాంక్ 26.5 శాతం, జమ్మూ అండ్ కాశ్మీర్ బ్యాంక్ 25.5 శాతం వృద్ధిని నమోదు చేశాయి. పెద్ద ప్రభుత్వ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా 18.6 శాతం, కెనరా బ్యాంక్ సుమారు 18 శాతం రుణాల వృద్ధిని సాధించాయి. కార్పొరేట్ రంగంతో పాటు రిటైల్, వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నుంచి రుణాలకు భారీ డిమాండ్ రావడం ఇందుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు.
డిపాజిట్లలో మాత్రం నిరాశ..
రుణాలు పెరిగినంతగా డిపాజిట్లు పెరగకపోవడం బ్యాంకులకు కొత్త సవాలుగా మారింది. ఆర్‌బీఎల్ బ్యాంక్‌లో డిపాజిట్లు త్రైమాసిక ప్రాతిపదికన 10.2 శాతం తగ్గాయి. ఐడీబీఐ బ్యాంక్‌లో 6.3 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో 0.9 శాతం డిపాజిట్లు తగ్గాయి. కొన్ని ప్రైవేట్ బ్యాంకులు అధిక వడ్డీ చెల్లించాల్సిన భారీ డిపాజిట్లను ఉద్దేశపూర్వకంగా తగ్గించినప్పటికీ.. మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థలో డిపాజిట్ వృద్ధి మాత్రం లోన్స్ కంటే వెనుకబడింది.
ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది?
ఈసారి మొదటి త్రైమాసికంలోనే రుణాల డిమాండ్ పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అత్యవసర రుణ హామీ పథకం అమలు, వెస్ట్ ఆసియా ఉద్రిక్తతల కారణంగా హోర్ముజ్ జలసంధి వద్ద సరఫరా గొలుసు అంతరాయం ఏర్పడటం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరగడం, అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఆయిల్ కంపెనీలు అధికంగా రుణాలు తీసుకోవడం వంటి అంశాలు దీనికి దోహదపడ్డాయి.
బ్యాంకులకు ఎందుకు ఇది టెన్షన్?
బ్యాంకులు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించి వాటినే రుణాలుగా ఇస్తాయి. కానీ డిపాజిట్ల కంటే రుణాలు వేగంగా పెరిగితే నిధుల సమీకరణ కష్టమవుతుంది. ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థలో లోన్-టు-డిపాజిట్ నిష్పత్తి 82.7 శాతానికి చేరుకుంది. ఇది గత పదేళ్లలోనే అత్యధిక స్థాయిల్లో ఒకటిగా నిపుణులు చెబుతున్నారు. అంటే బ్యాంకుల వద్ద ఉన్న ప్రతి రూ.100 డిపాజిట్లకు దాదాపు రూ.83 రుణాలుగా వెళ్లిపోతునట్లే.
కస్టమర్లపై ప్రభావం ఏమిటి?
ఈ లోన్స్ ట్రెండ్ ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో బ్యాంకులు ఎక్కువ డిపాజిట్లను ఆకర్షించేందుకు ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంది. మరోవైపు నిధుల వ్యయం పెరిగితే రుణాలపై వడ్డీ రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రుణాల వృద్ధి ఎంత ముఖ్యమో.. అంతే స్థాయిలో డిపాజిట్లు కూడా పెరగడం బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరత్వానికి అవసరమని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మోడ్రన్ లగ్జరీ లైఫ్ కోరుకుంటున్న మధ్యతరగతి ప్రజలు వేగంగా ఇండియాలో పెరగటం వారి కొనుగోలు శక్తిగా ప్రభుత్వాలు కాకి లెక్కలు చెబుతుంటే.. నిజానికి ప్రజలు సేవింగ్స్ లేకపోగా అప్పులపాలై ఆర్థిక ఒత్తిడిలోకి జారుకుంటున్నారని బ్యాంకుల గణాంకాలు చెబుతున్నాయి.
