జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షకాల సమావేశాలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. 2026, జూలై 20 నుంచి ఆగస్టు 13 వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు శనివారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 2026, జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగుతాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ సిఫార్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దేశానికి సంబంధించిన కీలక అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో సానుకూల చర్చ జరుగుతుందని ఆశిస్తున్నా’’ అని ఆయన పేర్కొన్నారు. 

రసవత్తరంగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ఉద్ధవ్ థాకరే శివసేన (యూబీటీ)లలో చీలికల తర్వాత తొలిసారి పార్లమెంట్ సమావేశం కానుండటంతో ఈ సెషన్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. టీఎంసీలోని 28 మంది లోక్‌సభ సభ్యులలో 20 మంది తిరుగుబావుటా ఎగరేసి అధికార ఎన్డీఏ కూటమికి మద్దతు పలికిన విషయం తెలిసిందే. 

ALSO READ : ఒకే ఒక్క రాత్రి వర్షానికి కుంగిపోయిన 12 వేల కోట్ల జాతీయ రహదారి..!

అదేవిధంగా శివసేన యూబీటీకి చెందిన తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు ఏక్‌నాథ్ షిండే శివసేనలో చేరారు. తద్వారా లోక్ సభలో ఎన్డీఏ సంఖ్యాబలం పెరిగింది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల వంటి కీలకమైన బిల్లుల ఆమోదానికి సభలో ఎన్డీఏకు మరింత బలం చేకూరింది. అయితే, ప్రత్యేక గ్రూపులుగా గుర్తింపు కోరుతూ టీఎంసీ, యూబీటీ రెబల్ ఎంపీలు చేసిన అభ్యర్థనపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.