ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియటంతో గత 11 వారాలుగా స్థిరంగా ఉన్న ఇంధన ధరలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఆయిల్ కంపెనీలు రేట్ల పెంపును షురూ చేశాయి. దీంతో వారం రోజుల గ్యాప్ లోనే రెండోసారి ధరలు పెరిగాయి. దీంతో నేడు పెట్రోల్ ధర లీటరుకు 87 పైసలు, డీజిల్ ధర లీటరుకు 91 పైసలు పెరిగింది. ఈ బాదుడు ఇక్కడితో ఆగేలా లేదని.. రాబోయే రోజుల్లో లీటరుకు మరో రూ.25 వరకు పెరిగే అవకాశం ఉందని నోమురా సంస్థ తన అంచనాలు బయటపెట్టింది.
ఈ హఠాత్ ధరల పెంపు వెనుక అంతర్జాతీయ రాజకీయాలు, సముద్ర రవాణా ఆంక్షలు ఉన్నాయి. అమెరికా-ఇరాన్ దేశాల మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ముడిచమురు రవాణా మార్గం 'హార్ముజ్ జలసంధి'ని ఇరాన్ మూసివేసింది. దీంతో సరఫరా దెబ్బతిని ముడిచమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి భారత్.. రష్యా, వెనిజులా నుంచి అదనపు ప్రీమియం చెల్లించి క్రూడ్ దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన ప్రధాని మోదీ.. ప్రజలు ఇంధనాన్ని పొదుపుగా వాడాలని, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని ఇటీవల సూచించారు.
►ALSO READ | గౌతమ్ అదానీకి క్లీన్ చిట్.. అమెరికాలో కేసులన్నీ పర్మనెంట్‌గా క్లోజ్, దూసుకెళ్తున్న అదానీ స్టాక్స్
గత వారం పెట్రోల్ డీజిల్ మీద లీటరుకు రూ.3 చొప్పున పెంచినప్పటికీ ఆయిల్ కంపెనీల నష్టాలు పూడటం లేదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ అమ్మకాల ద్వారా ప్రతిరోజూ ఏకంగా రూ.1,380 కోట్ల ఆదాయాన్ని నష్టపోతున్నాయి నోమురా, ఎలారా క్యాపిటల్ ఇచ్చిన సంయుక్త రిపోర్ట్ పేర్కొంది. గ్యాస్ సిలిండర్ ఒక్కంటిపై రూ.420 నుండి రూ.670 వరకు నష్టం వస్తోందట. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోయే 2 నుండి 10 ఏళ్లలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు తమ మొత్తం పెట్టుబడిని కోల్పోయి మూతపడే ప్రమాదం ఉందని నోమురా హెచ్చరించింది. ఈ భారీ నష్టాల నుంచి కంపెనీలను కాపాడేందుకు.. 2022 నాటి రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయం లాగే, రాబోయే రోజుల్లో కూడా రోజుకు కొన్ని పైసల చొప్పున ధరలను పెంచే దిశగా మోడీ సర్కార్ ముందుకెళ్లే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
