గౌతమ్ అదానీకి క్లీన్ చిట్.. అమెరికాలో కేసులన్నీ పర్మనెంట్‌గా క్లోజ్, దూసుకెళ్తున్న అదానీ స్టాక్స్

గౌతమ్ అదానీకి క్లీన్ చిట్.. అమెరికాలో కేసులన్నీ పర్మనెంట్‌గా క్లోజ్, దూసుకెళ్తున్న అదానీ స్టాక్స్

భారతీయ అపర కుబేరుడు, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీకి అమెరికాలో చాలా పెద్ద ఊరట లభించింది. ఆయనపై నమోదైన అన్ని రకాల క్రిమినల్, సెక్యూరిటీస్ ఫ్రాడ్ ఆరోపణలను అమెరికా న్యాయ శాఖ శాశ్వతంగా కొట్టివేసింది. న్యూయార్క్ కోర్టులో నడుస్తున్న ఈ హై-ప్రొఫైల్ కేసును 'విత్ ప్రిజుడీస్' కింద కొట్టేయాలని ప్రాసిక్యూటర్లు కోరడంతో.. ఈ కేసును ఇక ఎప్పటికీ తిరిగి తెరిచే అవకాశం లేకుండా పర్మనెంట్ గా క్లోజ్ చేశారు. గౌతమ్ అదానీతో పాటు ఆయన మేనల్లుడు సాగర్ అదానీపై ఉన్న ఆరోపణలన్నీ దీంతో పటాపంచలై క్లీన్ చిట్ వచ్చేసింది.

కేసు కొట్టేయడానికి అసలు కారణాలు..
భారత్‌లో సోలార్ ప్రాజెక్టుల కాంట్రాక్టుల కోసం అదానీ గ్రూప్ లంచాలు ఇచ్చిందంటూ.. అమెరికా ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టించిందంటూ గతంలో ఆరోపణలు వచ్చాయి. అయితే సుదీర్ఘ లీగల్ పోరాటం తర్వాత ఈ కేసులో అదానీకి వ్యతిరేకంగా ఎలాంటి సరైన ఆధారాలు లేవని, పైగా ఈ వ్యవహారానికి అమెరికాతో నేరుగా ఎటువంటి సంబంధాలు లేవని అమెరికా ప్రాసిక్యూటర్లు తేల్చారు. ఈ కేసుపై మరిన్ని వనరులను, సమయాన్ని వృథా చేయదలచుకోలేదని కోర్టుకు తెలిపారు.

దీనికి తోడు గత కొన్ని రోజులుగా అదానీ గ్రూప్ అమెరికాలోని ఇతర లీగల్ వివాదాలను సైతం సెటిల్ చేసుకుంది. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సివిల్ కేసులను ఎలాంటి తప్పు ఒప్పుకోకుండానే గౌతమ్ అదానీ 6 మిలియన్ డాలర్లు, సాగర్ అదానీ 12 మిలియన్ డాలర్లు చెల్లించి పరిష్కరించుకున్నారు. అలాగే ఇరాన్ ఆంక్షల ఉల్లంఘనకు సంబంధించిన ఎల్‌పీజీ దిగుమతుల వివాదాన్ని కూడా యూఎస్ ట్రెజరీకి 275 మిలియన్ డాలర్లు చెల్లించి, పూర్తి సహకారం అందిస్తూ అదానీ గ్రూప్ ముగించింది.

రాకెట్‌లా దూసుకెళ్తున్న అదానీ గ్రూప్ స్టాక్స్..
అమెరికా కోర్టు నుండి వచ్చిన ఈ సంచలన తీర్పుతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారతీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాలతో దూసుకుపోతున్నాయి. ఇన్వెస్టర్లలో నమ్మకం పెరగడంతో గ్రూప్ స్టాక్స్ అన్నీ గ్రీన్ జోన్లోకి వచ్చాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్,  అదానీ పోర్ట్స్, ఏసీసీ & అంబుజా సిమెంట్స్ ఇంట్రాడేలో లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. మెుత్తానికి అమెరికాలో కేసుల క్లోజర్ అదానీ గ్లోబల్ బిజినెస్ విస్తరణకు ఉన్న పెద్ద అడ్డంకిని తొలగించినట్లయింది. హిండెన్‌బర్గ్ వివాదం తర్వాత అదానీ కెరీర్‌లో ఇదొక అతిపెద్ద లీగల్ విజయంగా కార్పొరేట్ వర్గాలు భావిస్తున్నాయి.