హైదరాబాద్: బాగ్ లింగం పల్లి అంబేద్కర్ విద్యాసంస్థలు లా కాలేజ్ ఆధ్వర్యంలో "అడ్వకేట్ మారుతున్న పాత్ర" అనే అంశంపై ప్రత్యేక సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో న్యాయవాద వృత్తి చాలా కీలకమైనదని.. బ్రిటీష్ రాజ్యానికి వ్యతిరేకంగా జరిగిన స్వాతంత్ర ఉద్యమంలో ఎందరో లాయర్లు క్రియాశీలకంగా పాల్గొన్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం కోసం పోరాడుతున్న రోజుల్లో, చదువుకున్న లాయర్లే కోర్టులలో కేసులను వాదించి గెలిచేవారని, యూత్ కాంగ్రెస్‌లో ఎంతోమంది న్యాయ వాద వృత్తిని ఎంచుకున్న యువతీ యువకులు ఉన్నారని ఆయన గుర్తుచేశారు.
ఈ వృత్తి.. లీగల్ పాయింట్స్ నేర్చుకోవడానికి, కోర్టు కేసులను అర్థం చేసుకోవడానికి ఒక మంచి అవకాశమని.. లాయర్లు ఒక కేసులో అనుకూలంగానూ, మరో కేసులో వ్యతిరేకం గానూ వాదించాల్సి ఉంటుందని చెప్పారు. అందువల్ల వారికి ఏ సమస్యపైన అయినా ఒక సమగ్రమైన దృక్పథం ఏర్పడుతుందని, మంచి లాయర్లు కావాలంటే నిరంతరం చదువుకుంటూ ఉండాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు.
కేస్ స్టడీస్ ఎక్కువగా చదివినప్పుడే పునాది బలంగా మారుతుందని, సమాజంలో వ్యాపారం, రాజకీయాలు, మీడియా వంటి అన్ని రంగాల్లో సంస్కరణలు వస్తున్నట్లే, న్యాయవ్యవస్థలో కూడా సంస్కరణలు రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
ALSO READ : హైదరాబాద్ లో భార్యను చంపిన భర్త
ప్రభుత్వాలు బలహీనంగా ఉన్నప్పుడు న్యాయవ్యవస్థ బలంగా, న్యాయవ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు బలంగా మారుతుంటాయని తెలిపారు. ప్రభుత్వం, న్యాయవ్యవస్థల మధ్య సమతుల్యత ఉండాలని, న్యాయ వ్యవస్థ మరింత బలోపేతం కావడానికి సంస్కరణలు ఎంతో ముఖ్యమని మంత్రి వివేక్ వెంకటస్వామి ఈ సందర్భంగా చెప్పారు.
