రోహిత్ టెస్టుల్లోనూ సక్సెస్ అవుతాడు

రోహిత్ టెస్టుల్లోనూ సక్సెస్ అవుతాడు

న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతడి బ్యాటింగ్ కన్నుల పండువగా ఉంటుందని విశ్లేషకులు ప్రశంసిస్తుంటారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ టైమింగ్, పుల్ షాట్ ఆడే తీరుకు చాలా మంది ఫిదా అవుతారు. అయితే లిమిటెడ్ ఓవర్స్‌ క్రికెట్‌లో చిచ్చరపిడుగులా రెచ్చిపోయే రోహిత్ టెస్టుల్లో మాత్రం దాన్ని రిపీట్ చేయలేకపోతున్నాడు. ఇప్పటివరకు ఓపెనర్‌‌గా 10 టెస్టులు ఆడిన హిట్‌మ్యాన్ 556 రన్స్ మాత్రమే చేశాడు. లాంగ్‌ ఫార్మాట్లో రోహిత్ మెరుగ్గా ఆడగలడని ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ మైకేల్ అథర్టన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. రోహిత్‌ న్యాచురల్ బ్యాట్స్‌మన్‌ అని పొగిడాడు.

‘రోహిత్ ఆటను నేను గమనిస్తున్నా. అతడు టెస్టుల్లో సక్సెస్‌ కాలేడని అందరూ భావిస్తున్నారు. టెస్టుల్లో కూడా విజయవంతమయ్యే సత్తా రోహిత్‌కు ఉంది. అతడు చాలా సహజంగా కనిపిస్తాడు. ఓవర్ కోచింగ్ తీసుకున్నట్లు గానీ, బలవంతంగా ఆడుతున్నట్లు గానీ కనిపించడు. కొన్నేళ్ల క్రితం రాహుల్ ద్రవిడ్‌తో చాటింగ్‌లో ఓ విషయం అడిగా. ఇండియా ప్లేయర్స్‌తో పోల్చుకుంటే ఇంగ్లండ్ ఆటగాళ్లు ఎందుకు బలవంతంగా ఆడుతున్నట్లు కనిపిస్తారని ప్రశ్నించా. దానికి జవాబుగా.. ఇంగ్లండ్‌లో వాతావరణం వల్ల ప్లేయర్స్ ఆరు నెలల ఇండోర్‌‌లో బౌలింగ్ మెషీన్స్‌పై ప్రాక్టీస్ చేస్తారు. మరో ఆరు నెలల ఔట్‌డోర్‌‌లో ఆడతారు. అదే ఇండియాలో ఏడాది మొత్తం క్రికెట్ ఆడుతూనే ఉంటారని ద్రవిడ్ చెప్పాడు’ అని అథర్టన్ పేర్కొన్నాడు.