బొగ్గు బావుల దగ్గర కనిపించని గులాబీ జెండా

బొగ్గు బావుల దగ్గర కనిపించని గులాబీ జెండా
  • బొగ్గుబావుల దగ్గర కనిపించని గులాబీ జెండా
  • రాష్ట్రంలో అధికారం కోల్పోవడంతో పత్తాలేని యూనియన్
  • గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం లేదు
  • కండువాలు కప్పుకొనేందుకూ‌‌ కార్మికుల వెనుకడుగు
  • కొన్ని ఏరియాల్లో ఐఎన్ టీయూసీలో విలీనం
  •  రేపే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు

హైదరాబాద్: బొగ్గుబావులపై గులాబీ జెండా కనిపించడం లేదు. రాష్ట్రంలో ఆ పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం( టీబీజీకేఎస్) లీడర్లు పత్తా లేకుండా పోయారు. కీలక నేతలు వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. సింగరేణి బొగ్గు గనులు 11 ఏరియాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎక్కడా గెలువలేదు. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. కార్మికుల్లో బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉందని తెలుసుకున్న టీబీజీకేఎస్  నాయకులు ఈ సారి గుర్తింపు సంఘం ఎన్నికల బరి నుంచి తప్పుకొన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు సార్లు నిర్వహించిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించింది. అలాంటి యూనియన్ మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అస్త్ర సన్యాసం స్వీకరించడం విస్మయం కలిగిస్తోంది. సింగరేణి గనులు విస్తరించి ఉన్న కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల పరిధిలో హోరా హోరీగా ప్రచారం జరుగుతుండగా ఏ బొగ్గుబాయి దగ్గర కూడా గులాబీ జెండా కనిపించకపోవడం గమనార్హం. నాయకులు కనీసం కండువాలు కప్పుకొని కూడా కనిపించడం లేదు.

పలుచోట్ల టీబీజీకేఎస్ ఖాళీ

అధినేత ఆదేశాల మేరకే తాము ఈ సారి గుర్తింపు సంఘం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని టీబీజీకేఎస్ నేతలు చెబుతున్నారు. సాక్షాత్తూ కేసీఆర్ తనయ కవిత గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన టీబీజీకేఎస్ ఈ సారి పోటీలో లేకపోవడంతో కార్మికులు డీలా పడిపోయారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య తాము రాజీనామా చేస్తున్నట్టు గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేఖలు  పంపారు. ఆ తర్వాతే వాళ్లు ముగ్గురు సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. పలు ఏరియాల్లో టీబీజీకేఎస్ ఐఎన్టీయూసీలో విలీనమైంది. 

ఊహించని పరిణామంతో ఉక్కిరి బిక్కిరి

పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన పరిస్థితి ఇది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి గులాబీ జెండా వెన్నంటి నిలిచిన తెలంగాణ బొగ్గుగని కార్మిక  సంఘం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలైన నెల రోజుల లోపే సుప్తచేతనావస్తలోకి చేరడం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. రెండు సార్లు గుర్తింపు సంఘంగా గెలిచి బొగ్గు గనులపై తమదైన ముద్ర వేసుకున్న గులాబీ జెండా ప్రాభవం కోల్పోవడం గమనార్హం.