మళ్లీ అవిశ్వాసాల లొల్లి..పలు మున్సిపాలిటీల్లో మొదలైన రగడ

మళ్లీ అవిశ్వాసాల లొల్లి..పలు మున్సిపాలిటీల్లో మొదలైన రగడ
  • పార్టీ మారి నోటీసులిస్తున్న కౌన్సిలర్లు
  • బీఆర్ఎస్, కాంగ్రెస్​ నడుమ నంబర్​ గేమ్​
  • క్యాంప్ రాజకీయాలతో హీటెక్కిన పాలిటిక్స్ 
  • జమ్మికుంట కాంగ్రెస్ క్యాంప్​పై బీఆర్ఎస్ లీడర్ల దాడి.. తీవ్ర ఉద్రిక్తత  

వెలుగు, నెట్​వర్క్ :  రాష్ట్రవ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల్లో మళ్లీ అవిశ్వాసాల లొల్లి మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలిచి అధికారంలోకి రావడం, ఈ జనవరితో పాలకవర్గాలకు మూడేండ్ల గడువు పూర్తికావడంతో ఇన్నాళ్లూ బీఆర్ఎస్​లో అసంతృప్తితో రగిలిపోతున్న కౌన్సిలర్లు కాంగ్రెస్​లో చేరి మరీ అవిశ్వాస నోటీసులు ఇస్తున్నారు. ఈ క్రమంలో క్యాంపు రాజకీయాలు షురూ కాగా.. మున్సిపాలిటీలు చేజారకుండా చూసుకునేందుకు బీఆర్ఎస్, తమ ఖాతాలో వేసుకునేందుకు కాంగ్రెస్​ లీడర్లు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. 

అవిశ్వాస మీటింగులకు కాంగ్రెస్​నేతలు తేదీలు ఖరారు చేయిస్తుంటే, కోర్టుల నుంచి స్టేలు తెచ్చే ప్రయత్నాల్లో బీఆర్ఎస్​లీడర్లు బిజీ అయ్యారు. మరోవైపు రెండు క్యాంపుల నడుమ నంబర్​గేమ్​తీవ్రమైన చోట.. ఇరు పార్టీల కౌన్సిలర్లు ఏకంగా వీధి పోరాటాలకు దిగుతున్నారు.  జమ్మికుంట మున్సిపాలిటీకి సంబంధించి హైదరాబాద్ సమీపంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్​క్యాంప్ పై బీఆర్ఎస్​నేతలు బుధవారం దాడికి దిగడం కలకలం సృష్టించింది. హుజూరాబాద్​ఎమ్మెల్యే కౌశిక్​రెడ్డి స్వయంగా క్యాంప్​ వద్దకు రావడంతో ఉద్రిక్తత పెరిగింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి, ఇరువర్గాలను చెదరగొట్టారు. 

నోటీసులు.. క్యాంపులు.. 

నిర్మల్ జిల్లా ఖానాపూర్ చైర్మన్, వైస్ చైర్మన్లపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రతిపాదించారు. 9 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా.. వీడీసీ, కాంగ్రెస్​ మధ్య వార్​నడుస్తోంది. అవిశ్వాసం పెట్టవద్దంటూ కౌన్సిలర్లకు వీడీసీ వార్నింగ్ ఇచ్చింది. వీడీసీ పరిధి దాటుతోందంటూ కాంగ్రెస్​ఫ్లోర్​లీడర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ప్రయత్నిస్తున్నాడని ఆరోపిస్తూ వీడీసీ కూడా కౌంటర్​గా ఫిర్యాదు చేసింది. ఈ నెల 5న అవిశ్వాసం పై ఓటింగ్ జరగనుండగా, తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజనిపై కౌన్సిలర్లు మంగళవారం అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. నల్గొండ మున్సిపల్​చైర్మన్​పై ప్రతిపాదించిన అవిశ్వాసంపై ఈ నెల 8న మీటింగ్ జరగాల్సి ఉండగా, హైకోర్టు నుంచి స్టే తెచ్చేందుకు బీఆర్ఎస్ లీడర్లు ప్రయత్నిస్తున్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి మున్సిపల్​చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్యపై బీఆర్ఎస్​కు చెందిన 16 మంది కౌన్సిలర్లతో పాటు 9మంది కాంగ్రెస్, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. ఆలేరులో బీఆర్ఎస్ చైర్మన్ వస్పరి శంకరయ్యపై బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు గతేడాదే నోటీసు ఇచ్చారు. వెంటనే మీటింగ్​ పెట్టాలని కౌన్సిలర్లు అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డిని కోరడంతో స్టే కోసం ఆలేరు చైర్మన్ ప్రయత్నిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రకటించారు. 

24 మందికి గాను 18 మంది కౌన్సిలర్లు అవిశ్వాసానికి మద్దతుగా సంతకాలు చేసినట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెంకటేశ్వరరావు కాంగ్రెస్​లో చేరడంతో బీఆర్ఎస్ అవిశ్వాసానికి సిద్ధమైంది. సిద్దిపేట జిల్లా చేర్యాల చైర్ పర్సన్, వైస్ చైర్మన్లపై ఇచ్చిన అవిశ్వాస నోటీసు పై ఈ నెల 19న మీటింగ్​ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఐదుగురు కౌన్సిలర్లతో పాటు కాంగ్రెస్​లో చేరిన కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్​పర్సన్ ఇందుప్రియపై బీఆర్​ఎస్ అవిశ్వాసానికి సిద్ధమైంది. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ చైర్మన్ మహమ్మద్ సద్దాం హుస్సేన్ పై 24 మంది కౌన్సిలర్లు అవిశ్వాస నోటీసు ఇచ్చారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతోందన్న కోపంతో సద్దాం హుస్సేన్ కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ చైర్మన్ జయబాబుపై కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ కౌన్సిలర్లు చేరడంతో కాంగ్రెస్ బలం పెరిగింది. ఇక నిజామాబాద్​జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ వినీతపై బీఆర్ఎస్ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం ఇచ్చారు. ఈ నెల 4న కలెక్టర్ మీటింగ్ నిర్వహించనున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతలతో వినీత సంప్రదింపులు జరుపుతున్నారు.

కాంగ్రెస్ ​గెలుపుతో మారిన సీన్.. 

2020 జనవరిలో జరిగిన మున్సిపల్​ఎన్నికల్లో అప్పటి అధికార పార్టీ బీఆర్ఎస్ అధికంగా​చైర్మన్, వైస్ చైర్మన్​పదవులను కైవసం చేసుకుంది. సంఖ్యాబలం లేనిచోట కాంగ్రెస్, ఇతర పార్టీల్లో గెలిచిన వారిని చేర్చుకుని మరీ మెజారిటీ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను దక్కించుకుంది. కానీ చాలాచోట్ల పాలకవర్గాల్లో ఏడాది, రెండేండ్లకే కుమ్ములాటలు మొదలయ్యాయి. ఫండ్స్​కేటాయింపులో చైర్​పర్సన్లు పక్షపాతం చూపుతున్నారని, తమకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని కౌన్సిలర్లు బహిరంగంగానే తమ అసంతృప్తి వెళ్లగక్కారు. అయితే అప్పటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నయానో, భయానో సభ్యులను కట్టడి చేస్తూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలాచోట్ల చైర్​పర్సన్లకు వ్యతిరేకంగా అవిశ్వాస నోటీసులు ఇచ్చినప్పటికీ, సమావేశాల దాకా వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఈలోగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​గెలిచి అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా సీన్​ మారిపోయింది. ఈ జనవరితో పాలకవర్గాలకు మూడేండ్ల గడువు కూడా పూర్తికావడంతో మరోసారి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అవిశ్వాస రాజకీయాలు జోరందుకున్నాయి.