మాకొద్దీ ట్రంప్ నో కింగ్.. అంటూ కదం తొక్కిన అమెరికన్లు

మాకొద్దీ ట్రంప్ నో కింగ్.. అంటూ కదం తొక్కిన అమెరికన్లు
  •     ట్రంప్ పాలన, విధానాలపై ప్రజల కన్నెర్ర
  •     దేశమంతటా వీధుల్లో నిరసనలు
  •     టైమ్స్‌‌ స్క్వేర్‌‌లో లక్ష మందికి పైగా ర్యాలీ
  •     ‘మేం అమెరికాను ప్రేమిస్తాం, 
  • ట్రంప్‌‌ను కాదు’ అంటూ నినాదాలు
  •     ‘హేట్‌‌ అమెరికా ర్యాలీ’గా పేర్కొన్న రిపబ్లికన్ ​పార్టీ 
  •     తాను రాజును కాదన్న ట్రంప్.. కొద్దిసేపటికే కిరీటం పెట్టుకొన్న ఏఐ వీడియో రిలీజ్​ 
  •     నిరసనకారులపై మలమూత్రాలు వదులుతున్నట్టు క్రియేషన్​
  •     ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు

న్యూయార్క్​: అమెరికాలో మరోసారి ప్రజాస్వామ్య జ్వాల రగిలింది. ట్రంప్ రాచరిక పాలన సాగిస్తున్నారంటూ ప్రజలు కన్నెర్రజేశారు.​ ట్రంప్​సర్కారు విధానాలకు నిరసనగా దేశమంతటా ప్రజలు ఆందోళనబాట పట్టారు. లక్షలాది మంది “నో కింగ్” నినాదాలు చేస్తూ ర్యాలీలు తీశారు. దేశంలో 2,600 కంటే ఎక్కువ ప్రదేశాల్లో ఒకేసారి ఈ నిరసనలు ఉధృతంగా కొనసాగాయి. వాషింగ్టన్‌‌‌‌, న్యూయార్క్‌‌‌‌, షికాగో, లాస్‌‌‌‌ ఏంజెలిస్​, అట్లాంటా, హ్యూస్టన్‌‌‌‌, బోస్టన్‌‌‌‌ లాంటి 50 నగరాల్లోని వీధుల్లో జనం కదం తొక్కారు. చిన్న పట్టణాలు మొదలుకొని పెద్ద నగరాల వరకు ప్రతిచోటా లక్షల మంది ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. “మేం అమెరికాను ప్రేమిస్తాం, ట్రంప్‌‌‌‌ను కాదు” అంటూ నినదించారు. 

రోడ్లు, పార్కులు, వీధులన్నీ నిరసనకారులతో రద్దీగా మారాయి. శాన్‌‌‌‌ఫ్రాన్సిస్కో బీచ్​ వద్ద కొంత మంది ‘నో కింగ్’ అని సంకేంతం వచ్చే మానవహారంగా ప్రదర్శన ఇచ్చారు. టైమ్స్‌‌‌‌ స్క్వేర్‌‌‌‌లో లక్ష మందికి పైగా ర్యాలీలో పాల్గొన్నారు. వాషింగ్టన్ డీసీలో ట్రంప్ ఇంటి సమీపంలోనే లక్షలాది మంది జనం గుమిగూడారు. శాంతియుతంగా నిరసన తెలిపారు.‘నో కింగ్స్ ఇన్ అమెరికా’,  ‘డెమొక్రసీ , నాట్ డిక్టేటర్ షిప్’,  ‘వి ద పీపుల్ సే నో’.. అంటూ నినాదాలు చేశారు.  ట్రంప్‌‌‌‌ పాలన ప్రజాస్వామ్య విలువలను తొక్కేస్తున్నదని ఆందోళనకారులు మండిపడ్డారు. మీడియాపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులపై కేసులు, వలసదారులపై కఠిన చర్యలు, నేషనల్‌‌‌‌ గార్డ్‌‌‌‌ బలగాల వినియోగం - ఇవన్నీ రాచరిక పాలనను తలపిస్తున్నాయని అన్నారు. తమకు అలాంటి పాలన అవసరం లేదని తెగేసి చెప్పారు. ర్యాలీ నేపథ్యంలో అనేక అమెరికా రాష్ట్రాలు నేషనల్ గార్డ్‌‌‌‌ను మోహరించాయి.  కాగా, ఒక్క హింసాత్మక ఘటన కానీ, అరెస్టు కానీ చోటుచేసుకోలేదు.

ఎలా మొదలైందంటే?

ట్రంప్​అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ‘నో కింగ్’ ఆందోళన జరగడం ఇది మూడోసారి. అధికారం చేపట్టాక ట్రంప్‌‌‌‌ వలసల నియంత్రణ చర్యలు, వర్సిటీలకు ఫండ్స్‌‌‌‌లో కోత, అనేక రాష్ట్రాల్లో నేషనల్‌‌‌‌ గార్డ్‌‌‌‌ దళాలు మోహరించడం లాంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారు.  మీడియాపై దాడులు, రాజకీయ ప్రత్యర్థులపై కేసులు, వలసదారులపై కఠిన చర్యలకు ఆదేశించారు. అధ్యక్షుడి అధికార పరిధిని విస్తరించారు. ఇది “రాజుల పాలన”ను తలపిస్తోందని మండిపడుతూ ప్రజలు ఆందోళన బాటపట్టారు. 2025 ప్రారంభంలో చిన్న చిన్న ప్రదర్శనలుగా మొదలై, పెద్ద ఉద్యమంగా మారాయి. ఈ నిరసనలకు ఇండివిజిబుల్  అనే ప్రగతిశీల సమూహం నాయకత్వం వహిస్తుండగా.. 200కి పైగా ఇతర గ్రూపులు (మూవ్‌‌‌‌ఆన్, ఏసీఎల్‌‌‌‌యూ, అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ టీచర్స్) కలిసి పనిచేస్తున్నాయి. తాజా ఆందోళనకు ఇండివిజిబుల్‌‌‌‌ సహ వ్యవస్థాపకురాలు లియా గ్రీన్‌‌‌‌ బర్గ్‌‌‌‌  ప్రాతినిథ్యం వహించారు. రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని రక్షించేందుకే తాము వీధుల్లోకి వచ్చామని వ్యాఖ్యానించారు.   డెమోక్రాట్లతో పాటు పలు సంఘాలు, ప్రముఖ వ్యక్తుల నుంచి భారీ మద్దతు లభించింది.  “ఇది అమెరికా వ్యతిరేక ర్యాలీ కాదు, అమెరికా కోసం ప్రజల స్వరం” అని డెమోక్రాటిక్‌‌‌‌ నేత చక్‌‌‌‌ షూమర్‌‌‌‌ పేర్కొన్నారు.  కాగా, అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోనూ ట్రంప్​ పాలనకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. లండన్‌‌‌‌, కెనడాతోపాటు బెర్లిన్‌‌‌‌, రోమ్‌‌‌‌, పారిస్‌‌‌‌, స్వీడన్‌‌‌‌లోని యూఎస్‌‌‌‌ రాయబార కార్యాలయాల వెలుపల కూడా ఆందోళన చేశారు.

నిరసనలపై రిపబ్లికన్ ​పార్టీ విమర్శలు

ట్రంప్​ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు చేపట్టిన నిరసనలను అధికార రిపబ్లికన్​ పార్టీ ఖండించింది. ఇవి ‘హేట్​ అమెరికా’ నిరసనలు అని పేర్కొన్నది.  ప్రెసిడెంట్​ ట్రంప్​ కూడా దీనిపై స్పందించారు. ‘నన్ను రాజు అని అంటున్నారు.. కానీ నేను రాజును కాదు’ అని ఫాక్స్​ న్యూస్​కు వెల్లడించారు. అయితే, కొద్దిసేపటికే ఆయన టీం.. ట్రంప్​ కిరీటం ధరించి విమానం నడుపుతున్నట్టు ఏఐ వీడియోను ట్రూత్ ​సోషల్‌‌‌‌లో పెట్టింది. నిరసనకారులపై ఈ విమానం నుంచి మలమూత్రాలు జారవిడుస్తున్నట్టు వీడియోలో చూపించారు. వైస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ జేడీ వాన్స్‌‌‌‌ షేర్‌‌‌‌ చేసిన వీడియోలో పెలోసీతోపాటు డెమోక్రాటిక్‌‌‌‌ నేతలు ట్రంప్‌‌‌‌ ముందు మోకరిల్లినట్లు చూపించారు.