రైళ్లలో ఇచ్చే నాన్ వెజ్ భోజనంలో కేవలం హలాల్ పద్ధతిలో తయారైన మాంసాన్ని మాత్రమే వాడుతున్నారని వస్తున్న ఆరోపణలపై రైల్వే క్యాటరింగ్ సంస్థ (IRCTC) ఒక ప్రకటన చేసింది. రైళ్లలో పెట్టే మాంసాహార భోజనానికి హలాల్ సర్టిఫికెట్ తప్పనిసరి అనే నిబంధనలు ఏవీ లేవు అని IRCTC తేల్చి చెప్పింది.
2023 జూలైలో సోషల్ మీడియాలో ఇదే అంశంపై పెద్ద చర్చ జరిగింది. దింతో రైళ్లలో హలాల్ మాంసం వాడటంపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి NHRC (జాతీయ మానవ హక్కుల కమిషన్) రైల్వేలకు నోటీసు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ గొడవ వెలుగులోకి వచ్చింది. IRCTC ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ రైలు భోజనంలో హలాల్ సర్టిఫైడ్ ఉండాలనే మార్గదర్శకాలు లేవని చెప్పింది.
రైళ్లలో వడ్డించే మాంసాహారం (చికెన్) అనేది 2006 నాటి ఆహార భద్రత & ప్రమాణాల చట్టం (FSSAI) ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మాత్రమే ఉండాలి. లైసెన్స్ పొందిన క్యాటరింగ్ ఏజెన్సీలు తప్పనిసరిగా FSSAI నిబంధనలను పాటించాలి అని IRCTC ఖచ్చితంగా చెప్పింది.
ప్రజల్లో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకు హలాల్ మాంసం గురించే ప్రత్యేకంగా పాటించాల్సిన విధానం ఏదీ లేదు అని రైల్వే కార్పొరేషన్ ఈ ప్రకటన ద్వారా తెలిపింది.
దీని పై ఫిర్యాదు చేసిన వ్యక్తి ఏమన్నారంటే రైల్వేలు కేవలం 'హలాల్' మాంసంతో చేసిన భోజనాన్ని మాత్రమే ఇస్తున్నాయి. ఇది మతపరమైన వివక్ష కిందకు వస్తుంది. హిందూ, సిక్కు మత నమ్మకాలు ఉన్న ప్రయాణీకులు వాళ్ళ ఇష్టానికి తగ్గ భోజనం పొందలేకపోతున్నారు. దీనివల్ల వారి మత స్వేచ్ఛ, సమానత్వం వంటి ప్రాథమిక హక్కులు ఉల్లంఘనకు గురవుతున్నారని ఫిర్యాదుదారుడు అన్నారు.
