గవర్నర్ ప్రసంగంలో హామీల ప్రస్తావనేదీ?: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

గవర్నర్ ప్రసంగంలో హామీల ప్రస్తావనేదీ?: బీజేపీ ఎంపీ లక్ష్మణ్

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్ర అప్పులను సాకుగా చూపి ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టబోమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ హెచ్చరించారు. గవర్నర్ ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, వాటి అమలు  ప్రస్తావనే లేదన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. గవర్నర్ ప్రసంగం చూస్తే ఆరు గ్యారంటీల అమలుపై అనుమానాలు వస్తున్నాయన్నారు. రాష్ట్రం రూ. 5.5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని తెలిసీ, ఈ గ్యారంటీలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. మొదటి కేబినెట్ మీటింగ్ లోనే మెగా డీఎస్సీ ప్రకటిస్తామని చెప్పారని, ఇప్పుడు దాని ఊసే ఎత్తడంలేదన్నారు. కాంగ్రెస్ కు వంద రోజుల గడువు ఇస్తామని, ఆ తర్వాత గ్యారంటీల అమలు కోసం ప్రజల పక్షాన పోరాడతామన్నారు.

నల్గొండ జిల్లా చింతపల్లి పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ జరిగిందని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. మహిళల ఉచిత బస్సు ప్రయాణం ఖర్చులను ఇతర రంగాలపై మోపాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ పథకం వల్ల ఉపాధి కోల్పోతున్న వర్గాలను ఆదుకోవాలన్నారు. కర్నాటకలో ఆర్టీసీ జీతాలు ఇవ్వలేని స్థితికి దిగజారిందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో సహా ఏ పార్టీతోనూ తమకు పొత్తు ఉండదన్నారు. లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి నెలాఖరులో వచ్చే అవకాశం ఉందన్నారు.