రూ.2,285 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదు : మంత్రి కోమటిరెడ్డి

రూ.2,285 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేదు : మంత్రి కోమటిరెడ్డి

 హైదరాబాద్, వెలుగు : రీజినల్ రింగ్ రోడ్డు(ఆర్ఆర్ఆర్) భూసేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగా రూ.2,285 కోట్లు ముందస్తుగా చెల్లించాల్సిన అవస రం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. గురువారం ఆయన కేంద్రమంత్రి, రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి లెటర్ రాశారు. గతంలో రాసిన లేఖ ప్రకారం..రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ. 2,585 కోట్లు(50% ) చెల్లించాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) అడిగిందని మంత్రి గుర్తు చేశారు. అయితే, దానిపై జాతీయ రహదారుల శాఖతో  రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ సంప్రదింపులు జరిపిందని మంత్రి తెలిపారు.

కేంద్రంతో  సంప్రదింపుల తర్వాత రూ.100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ తోపాటు భూసేకరణ అవార్డులో సగం ఖర్చును అవార్డు జారీ అయిన 15 రోజుల్లో  చెల్లించుటకు అంగీకారం కుదిరిందని వెల్లడించారు. దీని ప్రకారమే గతేడాది ఏప్రిల్​లో రూ.100 కోట్ల రివాల్వింగ్ ఫండ్ ను తెలంగాణ ప్రభుత్వం జమచేసిందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రాసెస్ ఇంకా అవార్డు స్థితికి రాలేదని..అవార్డు జారీల ప్రకారంగానే 50% వాటాను రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మంత్రి తన లేఖ ద్వారా క్లారిటీ ఇచ్చారు. 

ఇతర ప్రాజెక్టులకు 65% భూసేకరణ పూర్తి

 ఒక్క రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన 1935 హెక్టార్ల భూసేకరణ మినహా, మిగతా ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ దాదాపు పూర్తి అయిందని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. మొత్తం 2377 హెక్టార్లకుగాను 1531 (దాదాపు 65%) హెక్టార్ల భూసేకరణ జరిగినట్లు వివరించారు.  రాష్ట్రంలో భారతమాల కింద చేపడుతున్న 11 జాతీయ రహదారులకు అవసరమైన 4,332 హెక్టార్ల భూమిలో ఇప్పటి వరకు 284 హెక్టార్లు మాత్రమే సేకరణ జరిగిందన్నారు.