కొత్త ప్రాజెక్టులకు బ్రేక్​!

కొత్త ప్రాజెక్టులకు బ్రేక్​!

అనుమతులొచ్చేదాకా ముందుకెళ్లొద్దు
ఏపీ, తెలంగాణ సర్కార్లకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశం
రెండు రాష్ట్రాల పరస్పర కంప్లయింట్లకు స్పందనగా లేఖలు
పర్మిషన్ లేకుండా కట్టడం విభజన చట్టానికి విరుద్ధం
ఏపీ కొత్త ప్రాజెక్టులకు డీపీఆర్ లేదన్న కేంద్రం
జూన్ 4న కృష్ణా బోర్డు, 5న గోదావరి బోర్డు మీటింగ్‌లు

వెలుగు బ్యూరో, హైదరాబాద్: కృష్ణా, గోదావరి నదులపై అనుమతి లేకుండా కొత్తగా చేపట్టిన, ప్రతిపాదించిన ప్రాజెక్టులు ఆపాలని ఆంధ్రప్రదేశ్​, తెలంగాణ ప్రభుత్వాలకు కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు జారీ చేసింది. అక్రమంగా ప్రాజెక్టులు కడుతున్నారంటూ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ఒకరిపై ఒకరు చేసుకున్న ఫిర్యాదులకు స్పందనగా రెండు రాష్ట్రాలకు కేంద్ర జలశక్తి శాఖ వేర్వేరుగా లేఖలు రాసింది. దీంతో ఏపీ సర్కారు చేపట్టిన పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, సంగమేశ్వరం ఎత్తిపోతలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా ప్రాజెక్టులు చేపట్టడం విభజన చట్టాన్ని బ్రేక్​ చేయడమేనని కేంద్ర జలశక్తి శాఖ తేల్చిచెప్పింది. పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపు, సంగమేశ్వర లిఫ్టులతో శ్రీశైలం నీళ్లకు పెద్ద గండి కొట్టడం వల్ల దక్షిణ తెలంగాణ ఎడారి అవుతుందన్న ఆందోళన కొన్ని రోజులుగా జరుగుతోంది. దీనిపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోవడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రోజూ రకరకాలుగా నిరసనలు చేస్తున్నాయి.

కృష్ణా ప్రాజెక్టులపై ఏపీకి..

కృష్ణానదిపై ఏపీ సర్కారు కొత్తగా ప్రతిపాదించిన ప్రాజెక్టులపై ఈ నెల 12న తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసింది. దీనిపై ఈ నెల 20నే కేంద్ర జలశక్తి శాఖ ఏపీ సర్కారుకు లేఖ రాసింది. విభజన చట్టం ప్రకారం కృష్ణా బోర్డు పరిశీలన జరగకుండా, నదీజలాల అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని చెప్పింది. కొత్త ప్రాజెక్టులకు పాలన అనుమతి ఇస్తూ మే 5న ఏపీ సర్కారు జారీ చేసిన జీవో 203 విభజన చట్టం 11వ షెడ్యూల్ లోని సెక్షన్ 84కు విరుద్ధమని స్పష్టం చేసింది. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (డీపీఆర్) కూడా కృష్ణాబోర్డుకు గానీ, కేంద్ర వాటర్ కమిషన్ కు గానీ ఇవ్వలేదని గుర్తుచేసింది. బోర్డు లేదా కమిషన్ పరిశీలన, అపెక్స్ కౌన్సిల్ అనుమతి వచ్చే వరకు ఏపీ సర్కారు ముందుకు వెళ్లవద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంపై జూన్ 4న కృష్ణాబోర్డు మీటింగ్ జరపాలని నిర్ణయించారు. ఏపీ సర్కారు పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంపునకు ప్రయత్నిస్తోందంటూ కథనాలు రావడంతో మొదటగా బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్ స్పందించి.. కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు. దీనికి స్పందించిన కేంద్ర మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్ కృష్ణాబోర్డుకు ఆదేశాలిచ్చారు. ప్రస్తుతానికి పనులు ఆపాలని ఆదేశించడంతో పాటు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. ఇదే టైంలో పాలమూరుకు చెందిన ఓ రైతు నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ లో కేసు వేసి పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిప్ట్ పనులపై స్టే తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే జలశక్తి శాఖ ఆదేశాలు కీలకంగా మారాయి.

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులపై తెలంగాణకు..

పోతిరెడ్డిపాడుపై తెలంగాణ నుంచి అబ్జెక్షన్ వస్తుండడంతో దీనికి కౌంటర్ గా ఏపీ సర్కారు కూడా ఫిర్యాదులు మొదలుపెట్టింది. గోదావరిపై రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై మే 14న కృష్ణా, గోదావరి బోర్డులకు ఫిర్యాదులు చేసింది. వీటిలో కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ కెపాసిటీ పెంపు ప్రతిపాదనపైనా అభ్యంతరం చెప్పింది. వీటి ఆధారంగా శనివారం తెలంగాణ సర్కారుకు కూడా జలశక్తి శాఖ రెండు లెటర్లు రాసింది. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కృష్ణా, గోదావరి నదులపై కొత్త ప్రాజెక్టులు చేపట్టకూడదని చెప్పింది. అందువల్ల రెండు నదులపై తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టులు విభజన చట్టానికి విరుద్ధమని రాసింది.  అనుమతులు వచ్చే వరకు కొత్త ప్రాజెక్టులపై పనిచేయద్దని ఆదేశించింది. గోదావరి ప్రాజెక్టులపై చర్చించడానికి జూన్ 5న గోదావరి బోర్డు సమావేశం కానుంది.

రెండు సర్కార్లకు గుణపాఠం: సంజయ్

కేంద్ర జలశక్తి శాఖ ఆదేశాలు రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు గుణపాఠం కావాలని బీజేపీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్​ అన్నారు. ఇద్దరు సీఎంలు ప్రాజెక్టుల పేరిట రెండు రాష్ట్రాల ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టి కమీషన్లు దోచుకొని, దాచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.  ‘‘కృష్ణా నది జలాల వినియోగంపై ఉమ్మడి రాష్ట్రానికి బచావత్​ ట్రిబ్యునల్​ ప్రకారం కేటాయించిన 811 టీఎంసీల్లో తెలంగాణ రాష్ట్రానికి 535 టీఎంసీల నీటిని వినియోగించుకునే అధికారం ఉంది. అయితే కేసీఆర్ చేతకానితనం వల్ల  299 టీఎంసీలే వాడుకునే పరిస్థితి వచ్చింది. దీనితో పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు ఎడారిగా మారే ప్రమాదం ఏర్పడింది” అని ఆయన చెప్పారు. పోతిరెడ్డిపాడుపై తాము కేంద్ర మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్​కు ఫిర్యాదు చేసిన తర్వాత ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసిందని, తూతూ మంత్రంగా కేసీఆర్​ స్పందించారని అన్నారు. ఏపీ ప్రభుత్వం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఫిర్యాదు చేసిందని చెప్పారు. “ఇద్దరు సీఎంలు అన్నదమ్ములమే అంటరు. ఇద్దరూ దావత్​లు చేసుకుంటరు. మరి ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలకు అన్యాయం జరుగకుండా ప్రాజెక్టులు చేపట్టలేరా? అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది?’’ అని ప్రశ్నించారు. ‘‘సీఎం కేసీఆర్​ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అబద్ధాలతో మోసం చేయడంతోనే ఏపీకి అవకాశం దొరికింది. ఇప్పటి వరకు ఎన్ని టీఎంసీలకు సంబంధించి ఎన్ని ప్రాజెక్టులు పూర్తయ్యాయో కేసీఆర్​ చెప్పకపోవడంతోనే ఏపీకి చాన్స్​ దొరికింది. అందుకే గోదావరి ప్రాజెక్టులపై ఆ రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది” అని సంజయ్​ అన్నారు.  కాళేశ్వరం మూడో టీఎంసీ ఎత్తిపోతకు తెలంగాణ ప్రభుత్వం ఆదరాబాదరగా టెండర్లు ప్రకటించడమేమిటని ప్రశ్నించారు. దీని వెనుక అవినీతి కోణం ఉందని ఆరోపించారు. మల్లన్న సాగర్‌‌ సహా 10 రిజర్వాయర్ల నిర్మాణం ఇంకా జరగాల్సి ఉందని, రెండు టీఎంసీల నీటిని ఆపుకోలేని పరిస్థితుల్లో ఉంటే మూడో టీఎంసీ ఎత్తిపోయడానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎందుకింత తొందర అని నిలదీశారు. అనుమతుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా తీరిక లేని ఈ ప్రభుత్వానికి.. టెండర్లు వేయడానికి, కావాల్సిన వాళ్లకు టెండర్లు అప్పగించడానికి మాత్రం తీరిక ఉన్నట్టుందని దుయ్యబట్టారు. నదీజలాల్లో తెలంగాణకు చట్టబద్ధంగా రావాల్సిన నీళ్లు తెచ్చుకోవడానికి రాష్ట్ర బీజేపీ సహకారం అందిస్తుందని ఆయన చెప్పారు.

For More News..

ఎన్నార్సీ ఇప్పట్లో ఉండదు: అమిత్ షా