పరామర్శకు వెళ్తే పత్తకు లేరు

పరామర్శకు వెళ్తే పత్తకు లేరు
  • సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగి కుటుంబాన్ని కలిసేందుకు వెళ్లిన వైఎస్ షర్మిల
  • అప్పటికే ఇంటికి తాళం వేసుకోని వెళ్లిన ఫ్యామిలీ
  • టీఆర్ఎస్ నేతలే సాయిని దాచారంటూ షర్మిల ఫైర్

నేరేడుచర్ల, వెలుగు: జాబ్ నోటిఫికేషన్లు వేయడం లేదని ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన ఓ నిరుద్యోగిని వైఎస్ షర్మిల పరామర్శించడానికి వెళ్లగా.. ఆ ఇంటి వారు తాళం వేసుకొని వెళ్లిపోయారు. సూర్యాపేట జిల్లా మేడారం గ్రామానికి చెందిన నిరుద్యోగి నీలకంఠ సాయి ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. దీంతో సాయిని పరామర్శించడానికి షర్మిల మేడారం వెళ్లగా అప్పటికే బాధితుడి ఇంటి వారు తాళం వేసుకోని ఎటో వెళ్లిపోయారు. దీంతో అక్కడే కూర్చుని స్థానికంగా ఉన్న నిరుద్యోగులతో షర్మిల కొద్దిసేపు మాట్లాడారు.

నిరుద్యోగుల ఆత్మహత్యలు సిగ్గుచేటు..
ఆత్మహత్యకు యత్నించిన నిరుద్యోగి సాయిని పరామర్శించి ధైర్యం చెప్పడానికి వస్తే, సాయిని కనపడకుండా దాచారని షర్మిల మండిపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయిని రహస్య స్థావరానికి తరలించారని ఆరోపించారు. ‘తెలంగాణలో జాబ్ లు లేక నిరుద్యోగులు సూసైడ్ లకు పాల్పడుతున్నారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. 1,200 మంది ఆత్మబలిదానాలతో సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం సిగ్గుచేటు. రాష్ట్రంలో లక్షల్లో ఖాళీలున్నా నోటిఫికేషన్లు ఎందుకు వేయడం లేదో ప్రభుత్వం జవాబు చెప్పాలి. ఎమ్మెల్యే సీటు ఖాళీ అయితే ఎందరిని దింపైనా డబ్బుతో గెలవాలని చూస్తారు.. కానీ ఉద్యోగాలు మాత్రం భర్తీ చేయడం లేదు. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దు.. ’ అని చెప్పారు. అనంతరం చింతలపాలెం మండలం దొండపాడులో వైసీపీ నాయకుడు గున్నం నాగిరెడ్డి కుంటుంబీకులు, నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణం బంగారుగడ్డలో నివాసముంటున్న సీనియర్ పొలిటీషియన్ ​సలీం కుటుంబీకులను షర్మిల పరామర్శించారు. వారి కుటుంబాలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.