ఎవరూ కొనటం లేదు : భారీగా తగ్గిన టమాటా హోల్ సేల్ ధర..

ఎవరూ కొనటం లేదు : భారీగా తగ్గిన టమాటా హోల్ సేల్ ధర..

కొన్ని రోజులుగా సామాన్యునికి చుక్కలు చూపిస్తోన్న టమాటా ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పట్టాయి. ములకల చెరువు వ్యవసాయ మార్కెట్‌లో రెండు రోజులుగా టమోటా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటి వరకు రూ.4 వేల 300 పలికిన 23 కేజీల బాక్సు ధర ఆగస్టు 6న అత్యధికంగా రూ.2 వేల 300కి చేరింది. నాణ్యతను బట్టి బాక్సు ధర రూ.15వందల నుంచి రూ.2 వేల 300 వరకు పలికింది.

టమోటా ధరలు సగానికి పైగానే తగ్గినట్టు తెలుస్తోంది. నిన్నటి వరకు డబుల్‌ సెంచరీకి చేరువైన కిలో ధర ప్రస్తుతం రూ.65 నుంచి రూ.100కు పడిపోయింది. ధరలు ఇంకా కొన్ని రోజులు అధికంగా ఉంటాయనుకున్న టమాటా రైతులు.. తాజా పరిణామాలతో తీవ్ర ఆందోళన నెలకొంది. ధరలు మరింత తగ్గుతాయేమోనని నిరాశ చెందుతున్నారు.

ఇటీవలి కాలంలో టమాటా ధరలు కొండెక్కడంతో.. రైతులు ఆనందం వ్యక్తం చేశారు. కొందరు రైతులైతే ఎప్పడూ లేని స్థాయిలో టమాటా ధరలు పెరగడంతో కోటీశ్వరులు కూడా అయ్యారు. ఒకానొక సందర్భంలో రూ.1, రూ. 2లు అమ్మిన రోజులు కూడా ఉన్నాయి. కనీస పెట్టిన పెట్టుబడి కూడా రాకపోవడంతో తమ పంటను రోడ్డుమీదే పారబోయడం కూడా చూశాం. అలాంటిది ఈ సారి ఇంత ధర పలకడంతో రైతులు తీవ్ర ఆనందం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం ఈ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. రానున్న రోజుల్లో ఇంకా తగ్గుతాయని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో మళ్లీ ఆందోళన మొదలైందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.