విద్యుత్ డిస్కమ్‌ లను ప్రైవేటీకరించం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

విద్యుత్ డిస్కమ్‌ లను ప్రైవేటీకరించం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
  • ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్త: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 

హైదరాబాద్, వెలుగు: విద్యుత్ డిస్కమ్‌లను ప్రైవేటీకరించబోమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ ఆఫీసర్లతో కమిటీ వేస్తామని ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నేతలతో భట్టి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ డిస్కమ్‌లను ప్రైవేట్‌పరం చేస్తారన్న ప్రచారాన్ని డిప్యూటీ సీఎం దృష్టికి జేఏసీ నాయకులు తీసుకువచ్చారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. డిస్కమ్‌ల ప్రైవేటీకరణపై అసత్య ప్రచారాలను ఖండించాలని సూచించారు. విద్యుత్ డిస్కమ్‌లను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించబోమనే విషయాన్ని ఉద్యోగులు విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. 

ఇంధన శాఖ దీర్ఘకాలం కొనసాగడానికి వీలుగా అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. విద్యుత్ సంస్థలను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉద్యోగులు, అధికారులపై ఉందన్నారు. 1912కు వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించి మెరుగైన సేవలకు విద్యుత్ సంస్థలు చిరునామాగా నిలపాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల సమస్యలు, ఇతర అంశాలు విని, పరిష్కరించేందుకు ఉద్యోగ సంఘాలకు ప్రతీ నెల ఒక గంట పాటు సమయం ఇచ్చేలా విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులను ఆదేశిస్తామని చెప్పారు. 

‘రైతు డిస్కం ఏర్పాటు, ఉద్యోగుల సర్దుబాటు, 2026  పీఆర్సీ, 2004 వరకు నియామకమైన వారికి పాత పెన్షన్స్ స్కీమ్ అమలు, రెగ్యులర్ ప్రమోషన్స్, రిక్రూట్మెంట్స్, ఆర్టిజన్ సమస్యలపై’విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తరఫున డిప్యూటీ సీఎం భట్టికి వినతిపత్రాన్ని అందించారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్ రావు, కో కన్వీనర్ బీసీ రెడ్డి, నాయకులు భూపాల్ రెడ్డి, సదానందం, స్వామి, రమేశ్‌, అశోక్, సుధాకర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జాతీయ స్థాయిలో కుల జనగణన జరగాలి.. 

జాతీయ స్థాయిలో సమగ్ర కుల జనగణన జరిగితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో ‘క్యాస్ట్ సెన్సెస్ డీపెనింగ్ ఆఫ్ సోషల్ జస్టిస్’అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో నిర్వహించే జనగణనలో అన్ని కులాల సామాజిక, విద్య, ఆర్థిక స్థాయిలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుల సర్వే దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని, దేశవ్యాప్తంగా సమగ్ర కుల జనగణన చేపట్టడానికి అది మార్గదర్శకంగా నిలుస్తుందని చెప్పారు. 

అనంతరం బీసీ ఉపాధ్యాయులు, ప్రొఫెషనల్స్, మేధావులు, విద్యార్థుల జాయింట్ యాక్షన్ కమిటీ, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. కార్యక్రమంలో పుస్తక రచయిత, ఆలిండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రిసర్చ్ స్కాలర్ కిరణ్ కుమార్, డాక్టర్ వాహిని బిల్లు, అశోక్, సురేందర్, గణేశ్‌, శివ, అరవింద్, లక్కీ, ప్రవీణ్, మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.