ప్రభుత్వ వైఫల్యాలను చూపే మీడియాపై ఆంక్షలేంది?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

ప్రభుత్వ వైఫల్యాలను చూపే మీడియాపై ఆంక్షలేంది?: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

హైదరాబాద్, వెలుగు: వీ6, వెలుగు మీడియాపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. నిజాలను నిర్భయంగా రాసే, ప్రసారం చేసే కొన్ని పత్రికలు, చానళ్లకు ప్రభుత్వం ఆహ్వానం పంపకపోవడంపై మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కొన్ని పత్రికలు, చానళ్లపై కుట్రపూరితంగా తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు విధించిందని విమర్శించారు. ‘అడాల్ఫ్ హిట్లర్+ జోసెఫ్‌ గోబెల్స్ = కేసీఆర్’ అని పేర్కొన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తెలంగాణలో చీకటి పాలన సాగుతోందని ఆరోపించారు. 

‘‘తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా.. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ వార్తలు రాసి, ప్రసారం చేసే వీ6, వెలుగు, ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ చానళ్లపై హిట్లర్‌‌ను మించి నియంతలా కేసీఆర్ వ్యవహరిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా స్వేచ్ఛను హరించడమంటే చీకటి పాలన సాగించడమే. బీఆర్ఎస్ ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకే పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేస్తున్నది. కేసీఆర్‌‌ను పొగుడుతూ గోబెల్స్ ప్రచారం, కట్టు కథలు, అబద్ధాలను నిజాలుగా రాసే ‘గుమస్తా’ పత్రికలు, చానళ్లకు మాత్రం ఎలాంటి ఆంక్షలు ఉండవు. పైగా కోట్ల రూపాయల ప్రభుత్వ ప్రకటనలకు కొదవ ఉండదు” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.