- పోయినేడు వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గిన సర్కార్
- ఎక్స్ పోర్ట్ పాలసీతో బాయిల్డ్ రైస్‌కు డిమాండ్
హైదరాబాద్,వెలుగు: ఈసారి యాసంగిలో వరి సాగుపై ఎలాంటి ఆంక్షలు ఉండవని రాష్ట్ర సర్కార్ తెలిపింది. పోయినేడు యాసంగిలో వరి వద్దే వద్దంటూ సర్కార్ ఆంక్షలు విధించింది. దీంతో రైతులు వరి సాగు చేయలేక, ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో వరే సాగు చేయగా, మరికొందరు భూములు బీడు ఉంచారు. ఈ క్రమంలో సర్కార్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. మళ్లీ ఈసారి ఆంక్షలు విధిస్తే రైతులు ఆగ్రహిస్తారని భావించిన ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీనికి తోడు కేంద్రం తెచ్చిన ఎక్స్ పోర్ట్ పాలసీలో మార్పులతో బాయిల్డ్ రైస్ కు డిమాండ్ పెరగనుంది. ఈ నేపథ్యంలో ఈసారి యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర నిర్ణయంతో దొడ్డు వడ్లకు డిమాండ్..
కేంద్రం పోయిన నెలలో ఎక్స్ పోర్ట్ పాలసీలో తీసుకున్న నిర్ణయంతో బాయిల్డ్ రైస్ ఎగుమతులకు డిమాండ్ పెరుగనుంది. సెప్టెంబర్ 9న ముడిబియ్యంపై 20 శాతం పన్ను విధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. నూకల ఎగుమతిపై నిషేధం విధించింది. ముడిబియ్యంపై పన్ను విధించడంతో ఎగుమతులు తగ్గిపోయే అవకాశం ఉంది. రాష్ట్రంలో యాసంగిలో వచ్చే ధాన్యం ఎక్కువగా బాయిల్డ్ రైస్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ముడి బియ్యంపై ట్యాక్స్, నూకలపై నిషేధం నేపథ్యంలో బాయిల్డ్ రైస్ ఎగుమతులు పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా బాయిల్డ్ రైస మిల్లర్లు యాసంగి ధాన్యం కొనుగోలు చేసి ఎగుమతి చేసుకునే చాన్స్ ఉంది. దీంతో రాష్ట్రంలో పండే దొడ్డు ధాన్యం రకాలకు అంతర్జాతీయంగా డిమాండ్ ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
పెరగనున్న వరి సాగు...
రాష్ట్ర సర్కార్ ఆంక్షలు ఎత్తివేయడంతో ఈసారి యాసంగిలో రికార్డు స్థాయిలో వరి సాగు కానుంది. నిరుడు యాసంగిలో వరి వద్దంటేనే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 35.84 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. ఇక ఈసారి ఆంక్షలు తొలగిపోవడంతో భారీగా సాగయ్యే అవకాశం ఉంది. అంతకుముందు 2020–21 యాసంగిలో అత్యధికంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేశారు. ఆ ఏడాది 90.22 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు సెంటర్లకు వచ్చింది. ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది.
సర్కారే కొనాలె..
రాష్ట్రంలో సాగయ్యే వరి పంటనంతా కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర సర్కారుపైనే ఉందని రైతులు అంటున్నారు. నిరుడు యాసంగిలో సర్కారు వద్దంటేనే సాగుకు అవకాశం ఉన్నా తగ్గించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. ఈసారి సాగుకు సహకరించడంతో పాటు కొనుగోళ్లు చేపట్టి రైతులకు నష్టం జరగకుండా చూడాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.
