
- నాలుగేండ్లుగా యువతకు లోన్లు లేవు
- 3 వేల కోట్లు కేటాయిస్తే.. ఖర్చు చేసింది రూ.7.10 కోట్లే
- రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాల పరిస్థితి దయనీయం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీసీల పరిస్థితి దయనీయంగా మారింది. అత్యంత వెనుకబడిన కులాలను సర్కారు పట్టించుకోవడం లేదు. బడ్జెట్‌లో వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నా.. లబ్ధిదారులకు ఇప్పటిదాకా 7.10 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. నిధులున్నా నాలుగేండ్లుగా నిరుద్యోగ యువతకు లోన్లు ఇవ్వడంలేదు. ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి వదిలేశారు. దానికి చైర్మన్, పాలకమండలి, అధికారులు, స్టాఫ్ ఎవరూ లేరు. 2017లో సీఎం కేసీఆర్ హడావుడిగా సమావేశం ఏర్పాటు చేసి ఎంబీసీలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వారి సంక్షేమం కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్లు చెప్పారు. కానీ నాలుగేండ్లు దాటినా ఇప్పటిదాకా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్రంలో సుమారు10 నుంచి 12% వరకు ఎంబీసీలు ఉన్నారని రిపోర్ట్‌లు చెబుతున్నాయి. కానీ ప్రభుత్వం వారి కోసం ఒక్క సంక్షేమ పథకం కూడా ప్రవేశపెట్టలేదు. 36 కులాలను ఎంబీసీలుగా గుర్తిస్తూ జీవో జారీ చేసిన అధికారులు మరో15 కులాల దాకా ఉన్నా వారిని పట్టించుకోవడం లేదు.
3 వేల కోట్లకు.. 7.10 కోట్లు మాత్రమే ఖర్చు..!
రాష్ట్ర బడ్జెట్‌లో ఎంబీసీలకు ఏటా వెయ్యి కోట్లు కేటాయిస్తామని ఎంబీసీల మీటింగ్‌లో సీఎం కేసీఆర్ ప్రకటించారు. బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించినా.. రూ. 350 కోట్లకే ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ అప్రూవల్ ఇచ్చింది. అందులోంచి అసెంబ్లీ ఎన్నికల ముందు కేవలం రూ.7.10 కోట్లు మాత్రమే లబ్ధిదారులకు ఖర్చు చేశారు. 2018–19 ఏడాదిలో వెయ్యి కోట్లు, 2019–20 సంవత్సరంలో జీరో కేటాయింపులు, 2020–21, 2021–22 బడ్జెట్‌లో రూ.500 కోట్ల చొప్పున కేటాయించారు. కానీ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. మొత్తంగా మూడు వేల కోట్లు కేటాయిస్తే.. కేవలం రూ. 7.10 కోట్లు మాత్రం లబ్ధిదారులకు చేరాయి.
పాలకమండళ్లు లేవు..
2017లో ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి చైర్మన్‌గా తాడూరి శ్రీనివాస్‌ను నియమించారు. పాలకమండళ్లను మాత్రం అపాయింట్ చేయలేదు. టర్మ్ మొత్తం ఒక్క చైర్మన్‌తోనే కొనసాగించారు. హైదరాబాద్‌లోని సంక్షేమ భవన్‌లో చైర్మన్ కోసం ఒక చాంబర్ ఏర్పాటు చేశారు. చైర్మన్ పదవీకాలం ముగిసి రెండేండ్లు దాటినా కొత్తవారిని నియమించడం లేదు. ఇక నాలుగు ఫెడరేషన్లకు కూడా పాలకమండళ్లు లేవు. ఎంబీసీలకు అధికారులు, స్టాఫ్ ఎవరూ లేరు. మొన్నటి దాకా బీసీ కార్పొరేషన్ లో పనిచేస్తున్న వారినే ఇన్‌చార్జులుగా కొనసాగించారు. స్టాఫ్, ఫర్నీచర్ కూడా బీసీ కార్పొరేషన్‌దే ఉపయోగించారు. ఇటీవల బీసీ గురుకులాలకు సెక్రటరీగా పనిచేస్తున్న మల్లయ్య బట్టును ఎంబీసీ కార్పొరేషన్‌కు ఇన్‌చార్జ్‌గా నియమించారు.
నాలుగేండ్లుగా లోన్లు బంద్..
రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల ముందు బీసీలకు సబ్సిడీ లోన్లు ఇచ్చింది. అందులో భాగంగా ఎంబీసీ కార్పొరేషన్ కింద 1,420 మంది దరఖాస్తు చేసుకోగా అందరికీ రూ.50 వేల చొప్పున రుణాలు ఇచ్చింది. అప్పటి నుంచి లోన్లు ఇవ్వడం బంద్ చేశారు. గతంలో ఎప్పుడో దరఖాస్తు చేసుకున్న 15 మందికి ఇటీవల మంత్రి గంగుల ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు.
తమిళనాడులెక్క ప్లాన్ చేయాలె..
ఆత్మగౌరవ భవనాల ను ముందుపెట్టి ఏం చేయకుండా బీసీల కు అన్యాయం చేస్తు న్నారు. ఎంబీసీలకు ఒక్క స్కీం కూడా తీసుకురాలేదు. బడ్జెట్‌లో వెయ్యి కోట్లు చూపిస్తున్నా నయా పైసా ఖర్చు పెట్టడం లేదు. ఎంబీసీ కులాలను గుర్తించడం లేదు. తమిళనాడు లెక్క ఎంబీసీ కార్పొరేషన్ కోసం స్పష్టమైన ప్లాన్ ఉండాలి.
- సంగెం సూర్యారావు, ఎంబీసీ సంఘాల అధ్యక్షుడు