వీకెండ్లో తుది నిర్ణయం.. ఇండియాలోనే ఆడాలని.. ఐసీసీ అల్టిమేటం ఇవ్వలేదన్న బీసీబీ

వీకెండ్లో తుది నిర్ణయం.. ఇండియాలోనే ఆడాలని.. ఐసీసీ అల్టిమేటం ఇవ్వలేదన్న బీసీబీ
  • తమ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిందని ప్రకటన

ఢాకా/దుబాయ్‌‌‌‌: వచ్చే నెలలో ఇండియా వేదికగా జరిగే  టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇండియాలో బంగ్లా జట్టు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, తమ మ్యాచ్‌‌‌‌లను తటస్థ వేదికలకు మార్చాలని చేసిన విజ్ఞప్తిపై ఐసీసీ సానుకూలంగా స్పందించిందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) బుధవారం తెలిపింది. తమ ఆందోళనలను ఐసీసీ పరిగణనలోకి తీసుకుందని ఓ ప్రకటన విడుదల చేసింది.

‘ఇండియాలో బంగ్లాదేశ్ జట్టు భద్రత, రక్షణకు సంబంధించి మేము లేవనెత్తిన అంశాలపై, అలాగే మ్యాచ్‌‌‌‌ల వేదికల మార్పు అభ్యర్థనపై ఐసీసీ నుంచి స్పందన లభించింది. టోర్నీలో బంగ్లాదేశ్ జట్టు పూర్తిస్థాయిలో, ఎటువంటి ఆటంకాలు లేకుండా పాల్గొనేలా చూస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది’ అని బీసీబీ పేర్కొంది. భద్రతా ప్రణాళికలో బీసీబీ సూచనలను కూడా స్వాగతిస్తామని ఐసీసీ తెలిపిందని చెప్పింది. బంగ్లాదేశ్‌‌‌‌లో  హిందువులపై దాడుల నేపథ్యంలో ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్‌‌‌‌ కాంట్రాక్టును రద్దు చేసిన తర్వాత బీసీబీ, బీసీసీఐ మధ్య వివాదం మొదలైంది.

ప్రతిగా తమ దేశంలో ఐపీఎల్‌‌‌‌ ప్రసారాలను బ్యాన్‌‌‌‌ చేసిన బంగ్లా.. భద్రతా కారణాల వల్ల తమ జట్టును ఇండియాకు పంపలేమని చెప్పింది.  టీ20 వరల్డ్ కప్‌‌‌‌లో తమ మ్యాచ్‌‌‌‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఐసీసీ ఉన్నతాధికారులు మంగళవారం రాత్రి  బీసీబీ ప్రతినిధులతో కాన్ఫరెన్స్ కాల్‌‌‌‌లో ఈ విషయాలు చర్చించారు. 

ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం బంగ్లాదేశ్ కోల్‌‌‌‌కతా, ముంబైలో నాలుగు మ్యాచ్‌‌‌‌లు ఆడాల్సి ఉంది. ఈ దశలో టోర్నీ షెడ్యూల్‌‌‌‌ను మార్చడం లేదా వేదికలను పూర్తిగా తరలించడం దాదాపు అసాధ్యమని ఐసీసీ అధికారులు అనధికారికంగా స్పష్టం చేసినట్లు సమాచారం. దానికి బదులుగా, కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేస్తామని బీసీబీకి ఐసీసీ ఆఫర్ చేసే అవకాశం ఉంది. దీనిపై ఆదివారంలోగా ఒక స్పష్టమైన నిర్ణయం వెలువడొచ్చు.