V6 News

జనగణన అడ్డంకి.. టీచర్ల బదిలీలు ఇప్పట్లో లేనట్టే! సర్వీస్ రూల్ మార్చితే 75 వేల మందికి మొండిచెయ్యే

జనగణన అడ్డంకి.. టీచర్ల బదిలీలు  ఇప్పట్లో లేనట్టే! సర్వీస్ రూల్ మార్చితే 75 వేల మందికి మొండిచెయ్యే
  • జూన్ 9 దాకా నో ట్రాన్స్‌‌‌‌‌‌‌‌ఫర్స్
  • నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీలకు షెడ్యూల్ వచ్చినా.. 
  • టీచర్లపై విద్యాశాఖ వెనక్కి 
  • జులై 7 తర్వాతే బదిలీలకు చాన్స్ 

హైదరాబాద్, వెలుగు:
రాష్ట్రంలో టీచర్ల బదిలీల ప్రక్రియ సందిగ్ధంలో పడింది. ప్రభుత్వం సాధారణ బదిలీలపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ, ఈ ప్రక్రియకు జనగణన నిర్వహణ అడ్డంకిగా మారింది. అన్ని శాఖల్లో మే నెలాఖరులోపు బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చినా.. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు,  క్షేత్రస్థాయి విధులతో స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు వెనక్కి తగ్గక తప్పని పరిస్థితి నెలకొన్నది. దీంతో టీచర్ల బదిలీలు ఇప్పట్లో ఉండవని స్పష్టమవుతున్నది. 

  • మూడేండ్ల నిబంధన తెస్తే.. 

ఇటీవలే స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌లో నాన్ టీచింగ్ సిబ్బంది బదిలీల షెడ్యూల్ ఇచ్చారు. అయితే ఇందులో గతంలో ఉన్న రెండేండ్ల కనీస సర్వీస్ నిబంధనను మూడేండ్లకు పెంచారు. ఇదే రూల్ టీచర్లకు కూడా వర్తింపజేయాలని విద్యాశాఖ యోచిస్తున్నది. ఇదే జరిగితే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది టీచర్లు బదిలీలకు అనర్హులవుతారు. రెండేండ్ల కిందటే ప్రమోషన్లు, బదిలీలతో కొత్త ప్లేసుల్లో చేరిన వారికి మూడేండ్ల నిబంధన పెడితే మళ్లీ బదిలీ అయ్యే అవకాశం ఉండదు.

రాష్ట్రంలోని ఉద్యోగుల సాధారణ బదిలీలకు సర్కారు అనుమతి ఇస్తూ జీవో రిలీజ్ చేసింది. దీని ప్రకారం మే ఒకటో తేదీ నుంచి 31 వరకూ ఈ ప్రక్రియ ముగించాల్సి ఉంది. అయితే, ఇది స్కూల్ ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని టీచర్లకు అమలయ్యేలా లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు ఇప్పుడు అడ్డంకిగా మారాయి. జనగణనలో పాల్గొంటున్న ఉద్యోగులను ఆ ప్రక్రియ ముగిసే వరకు బదిలీ చేయకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో తొలి దశ జనగణన పనులు నడుస్తున్నాయి. ఇవి జూన్ 9 వరకు కొనసాగుతాయి. టీచర్లలో అత్యధిక శాతం మంది ఈ విధుల్లోనే ఉండటంతో.. అప్పటి వరకూ బదిలీలు చేసే అవకాశం లేదు.  

  • ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి..

ప్రస్తుతం రాష్ట్రంలో 1.05 లక్షల మంది టీచర్లు ఉండగా, రెండేండ్ల కింద జరిగిన బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియలో సుమారు 75 వేల మందికి స్థానచలనం కలిగింది. జులై 7 నాటికి టీచర్లు కొత్త ప్లేసుల్లో చేరి రెండేండ్లు పూర్తవుతుంది. రెండేండ్ల కనీస సర్వీస్ నిబంధన కొనసాగిస్తే.. జులైలో బదిలీలు చేపట్టాలని టీచర్లు కోరుతున్నారు. 

ఇక తప్పనిసరి బదిలీల విషయానికొస్తే.. టీచర్లకు 8 ఏండ్లు, హెడ్మాస్టర్లకు 5 ఏండ్ల సర్వీస్ నిండాలి. కానీ, స్కూల్ ఎడ్యుకేషన్ అధికారుల లెక్కల ప్రకారం ఈ నిబంధన కిందకు వచ్చే వారు ప్రస్తుతం లేరని చెప్తున్నారు.  దీంతో తప్పనిసరి బదిలీల కంటే జనరల్ బదిలీలపైనే ఎక్కువ ఆశలు ఉన్నాయి. 

మరోపక్క, జనరల్ బదిలీల గడువు మే నెలాఖరుతో అయిపోతుండటంతో, ఆ తర్వాత టీచర్ల బదిలీలు చేపట్టాలంటే ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఈ లెక్కన పర్మిషన్ వస్తేనే.. జులై 7 తర్వాతే బదిలీల ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం ఉంది.