లక్షలిస్తం.. సీఎంతో కలిపిస్తం అంటూ ఆర్టీసీ కార్మికులకు ప్రలోభాలు

లక్షలిస్తం.. సీఎంతో కలిపిస్తం అంటూ ఆర్టీసీ కార్మికులకు ప్రలోభాలు

డ్యూటీలో చేరాలని ప్రలోభపెడుతున్న ఎమ్మెల్యేలు

వాటి ఎవరూ లొంగేది లేదని తెలుసుకోండి

ఆర్టీసీని లాకౌట్ చేసే అధికారం ఎవ్వరికీ లేదు

బెదిరింపులకు భయపడే ప్రసక్తేలేదు

ప్రభుత్వంతో మాట్లాడుతామని గవర్నర్ హామీ

ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి

 

హైదరాబాద్: ఆర్టీసీని లాకౌట్ చేసే అధికారం ఎవ్వరికీ లేదని, అలాంటి బెదిరింపులకు తాము బెదిరేది లేదని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి చెప్పారు. రాజ్ భవన్ లో సోమవారం సాయంత్రం ఆర్టీసీ జేఏసీ నేతలు.. గవర్నర్ తమిళి సైని కలిశారు. సమ్మెపై ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరుతోపాటు తమ డిమాండ్లపై నివేదిక అందించారు. ఆ తర్వాత ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు ధైర్యంగా ఉండాలని గవర్నర్ చెప్పారన్నారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని సూచించారన్నారు. ప్రభుత్వంతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారని చెప్పారు.

తామ్ము సమ్మెలో ఉండగా.. బోర్డ్ అనుమతి కూడా లేకుండా మళ్లీ కొత్తగా అద్దె బస్సులకు టెండర్లు పిలిచారని, వాటిని రద్దు చేయాలని గవర్నర్ ను కోరామని చెప్పారు. తమ డిమాండ్లను వివరించామని, గవర్నర్ సానుకూలంగా స్పందించారని చెప్పారాయన. జీతాలపైనా ప్రభుత్వం కోర్టుకు అబద్ధాలు చెబుతూ తప్పుదోవ పట్టిస్తోందన్నారు.

కోర్టు ఆర్డర్ కాపీ అందలేదని ప్రభుత్వం కాలయాపన చేస్తోందని అశ్వత్థామ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికులను ప్రలోభపెట్టాలని ఎమ్మెల్యేలు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.  లక్షల్లో డబ్బులిస్తామని, నేరుగా సీఎంని కలిపిస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారని, వీటి కార్మికులు ఎవరూ లొంగరని స్పష్టం చేశారు. ఇలాంటి తప్పుడు పనులను మానుకోవాలని హెచ్చరించారు.

ఇప్పటి వరకూ జేఏసీ కార్యాచరణ విజయవంతమవుతూ వచ్చిందన్నారు. తమకు సమ్మెలో మద్దతు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు చెప్పారు. మంగళవారం జూబ్లీ బస్ స్టేషన్ లో వంటావార్పు తో నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

ఆర్టీసీపై కన్నేసి కుట్రలు చేస్తున్నరు

ఆర్టీసీని లాకౌట్ చేసే అధికారం ఎవ్వరికీ లేదని అశ్వత్థామ స్పష్టం చేశారు. సంస్థపై కన్నేసి ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారాయన. ఆర్టీసీని లాకౌట్ చేస్తా అంటే భయపడే ప్రస్తకే లేదని చెప్పారు. ఆర్టీసీ ఆస్తులు.. కార్మికుల ఆస్తులని చెప్పారు.