అమెరికాలో ముసుగు దొంగల హల్ చల్

అమెరికాలో ముసుగు దొంగల హల్ చల్

లాస్ ఏంజిల్స్ : అమెరికాలోని లాస్ ఏంజిలిస్ లో భారీ దోపిడి జరిగింది. తోపంగా మాల్‌‌లోని నార్డ్​స్ట్రోమ్ డిపార్ట్​మెంట్​ స్టోర్‌‌లోకి పట్టపగలే ఒకేసారి ముసుగులు ధరించిన 50 మంది దొంగలు చొరబడ్డారు. స్టోర్‌‌ సెక్యూరిటీ గార్డులపై, సిబ్బందిపై పెప్పర్ స్ప్రేని ప్రయోగించారు. వారు తేరుకునేలోపే చేతికందిన బ్రాండెడ్ బ్యాగులు, ఖరీదైన బట్టలు దోచుకున్నారు. ఎంత వేగంగా స్టోర్‌‌లోకి వచ్చారో అంతే వేగంగా రూ. 83,29,350 విలువైన వస్తువులను చేతుల్లో  పట్టుకుని బయటకు పరుగులు తీశారు. మాల్‌‌ ఎదుట ముందే పార్క్ చేసుకున్న బీఎండబ్ల్యూ, లెక్సస్‌‌ వంటి పలు ఖరీదైన వాహనాల్లో దొంగలందరూ ఉడాయించారు. 

అంతమంది ఒకేసారి ముసుగులు వేసుకుని తమ కళ్లముందే దోచుకుపోతుంటే షాపు సిబ్బంది ఏమీ చేయలేక నిస్సహాయంగా నిలబడిపోయారు. శనివారం సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ ఘటన.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ కావడంతో  ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ దోపిడీని సీసీ టీవీ ఫుటేజ్ లో చూసిన లాజ్‌‌ఏంజెల్స్ పోలీసులు కూడా షాక్ అయ్యారు. స్టోర్ సిబ్బంది పట్ల దొంగలు చాలా దారుణంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు. 

వారు దోచుకున్న వస్తువుల విలువ రూ.83 లక్షల వరకు ఉంటుందని వెల్లడించారు. 50 మంది దొంగలు ఒకేసారి దూసుకురావడంతో  సిబ్బంది బిత్తరపోయారని చెప్పారు. వారంతా దొంగలను అడ్డుకోవటానికి యత్నించారని.. కానీ పెప్పర్ స్ప్రే కొట్టడంతో ఏమీ చేయలేకపోయారని వివరించారు. వారు తేరుకునేలోగా దుండగులు అందినకాడికి దోచుకుపోయారని చెప్పారు.