అమెరికాలో అదానీ కేసు సెటిల్మెంట్.. 'మోదానీ' బంధంపై రాహుల్ గాంధీ నిప్పులు

అమెరికాలో అదానీ కేసు సెటిల్మెంట్.. 'మోదానీ' బంధంపై రాహుల్ గాంధీ నిప్పులు

దేశ రాజకీయాల్లో మళ్లీ మోదీ-అదానీ బంధంపై చర్చ తారాస్థాయికి చేరింది. తాజాగా అమెరికాలో గౌతమ్ అదానీపై ఉన్న లంచం, మోసం కేసుల సెటిల్మెంట్ వ్యవహారం దేశీయంగా పెను రాజకీయ దుమారాన్ని రేపుతోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోడీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. అమెరికాతో కుదుర్చుకున్న తాజా వాణిజ్య ఒప్పందం కేవలం అదానీని రక్షించుకోవడానికేనని సంచలన ఆరోపణలు చేశారు. "ఒక రాజీపడ్డ ప్రధాని వాణిజ్య ఒప్పందం చేసుకోలేదు, అదానీ విడుదలకు బేరసారాలు ఆడారు" అంటూ రాహుల్ ఎక్స్‌ పోస్టులో పేర్కొన్నారు. అమెరికా ఇన్వెస్టర్లను మోసం చేశారన్న ఆరోపణల నుంచి బయటపడేందుకు భారత జాతీయ ప్రయోజనాలను పణంగా పెట్టారన్నది రాహుల్ ఆరోపించారు.

అదానీ గ్రూప్ తన సోలార్ ఎనర్జీ ప్రాజెక్టుల కోసం భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల లంచం ఇచ్చిందనే ఆరోపణలపై అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ గతంలో కేసు నమోదు చేసింది. అయితే తాజాగా అమెరికా ప్రభుత్వం ఈ వ్యాజ్యాన్ని సెటిల్మెంట్ కి అంగీకరించిందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అదానీ తరపున అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యక్తిగత న్యాయవాది రాబర్ట్ గియుఫ్రా జూనియర్ రంగంలోకి దిగడం ఈ కేసు మలుపు తిరగడానికి ప్రధాన కారణమని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. వాషింగ్టన్‌లోని న్యాయశాఖ అధికారులతో గియుఫ్రా జరిపిన చర్చల్లో.. ఈ కేసును కొనసాగించడానికి తగిన ఆధారాలు లేవని వాదించడంతో పాటు, ఒక భారీ ఆఫర్‌ కూడా ప్రతిపాదించినట్లు సమాచారం.

అదానీ గ్రూప్ తనపై ఉన్న చార్జీలను తొలగిస్తే.. అమెరికా ఆర్థిక వ్యవస్థలో ఏకంగా రూ.9వేల 500 కోట్లు పెట్టుబడి పెట్టడమే కాకుండా, సుమారు 15వేల ఉద్యోగాలను సృష్టిస్తామనే ప్రతిపాదన పెట్టినట్లు బయటకు వచ్చింది. దీనికి తోడు కేసు సెటిల్మెంట్ కోసం 6 మిలియన్ డాలర్లు డబ్బు చెల్లించడానికి కూడా అదానీ సిద్ధపడినట్లు వార్తలు వస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కూడా తీవ్రంగా స్పందించారు. అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం పూర్తిగా ఏకపక్షంగా ఉందని.. ట్రంప్ బెదిరింపులకు భయపడి మే 10న 'ఆపరేషన్ సింధూర్'ను కూడా ప్రధాని ఆపివేశారని ఆరోపించారు. 'మోదానీ' అవినీతి ఆరోపణలను తొలగించుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పావులు కదుపుతోందని విమర్శించారు.

మొత్తానికి అమెరికాలో అదానీ కేసు క్లోజ్ అవ్వడం వెనుక భారీ పెట్టుబడుల హామీలు, జరిమానాల చెల్లింపులు, దౌత్యపరమైన ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు ఇప్పుడు ఇండియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 2020 నుండి 2024 మధ్య కాలంలో జరిగిన లంచాల బాగోతం.. విదేశీ రుణాల సేకరణలో తప్పుడు ప్రకటనలు చేశారన్న ఆరోపణలను అదానీ గ్రూప్ మొదటి నుంచీ ఖండిస్తూనే ఉన్నప్పటికీ, తాజా సెటిల్మెంట్ వార్తలు ప్రతిపక్షాలకు కొత్త అస్త్రాన్ని అందించాయి. ప్రజల సొమ్ము, దేశ ప్రయోజనాల కంటే అదానీ ప్రయోజనాలే మోడీ ప్రభుత్వానికి ముఖ్యమా? అని రాహుల్ గాంధీ అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.