ఉత్పత్తి మాత్రమే కాదు.. ఆదాయం కూడా పెరగాలి

ఉత్పత్తి మాత్రమే కాదు.. ఆదాయం కూడా పెరగాలి
  • "అగ్రి ఇన్నోవేషన్ హబ్ " ప్రారంభ సభలో మంత్రి కేటీఆర్

హైదరాబాద్: ‘‘వ్యవసాయ రంగంలో కొత్త కొత్త ఆలోచనలు రావడం సంతోషం. స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆహార భద్రత పెద్ద సవాల్ గా ఉండేది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు ఆహార భద్రత కాదు న్యూట్రిషన్ ఫుడ్ పై దృష్టి సారిస్తున్నారు. వ్యవసాయ రంగం లో ఉత్పత్తి పెరుగుతుంది కానీ ఉత్పాదన, ఆదాయం కూడా పెరగాలి..ఆ దిశలో పరిశోధనలు జరగాలి’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాజేంద్రనగర్ లో ప్రొఫెసర్ జయజంకర్ తెలంగాణ  అగ్రికల్చర్ యూనివర్సిటీ లో  "అగ్రి ఇన్నోవేషన్ హబ్ "ను వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డితో కలసి   కేటీఆర్  ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి,  నాబార్డ్ ఛైర్మెన్ గోవిందా రాజులు, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్ రెడ్డి, సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 
 ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ దేశంలో 55 నుండి 60 శాతం మంది వ్యవసాయ రంగం పై ఆధారపడి బతుకుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు.  ఒక్క రైతు బంధు కోసమే సంవత్సరానికి 15 వేల కోట్లు రైతుల ఇస్తున్నామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం మనతోపాటే అధికారం లోకి వచ్చారు, రైతు ఆదాయం డబల్ చేస్తాం అని అన్నారు, కానీ ఏక్కడ కాలేదు, కొంత మేరుకు మాత్రమే సఫలీకృతం అయ్యాయన్నారు. 
రైతును మించిన ఇన్నోవేటర్ లేడు
‘‘ఇన్నోవేషన్ ఎవడి సొత్తుకాదు. రైతులు కూడా ఎన్నో ఇన్నోవేషన్లు చేస్తున్నారు. అగ్రి హబ్ లో ప్రతి బోర్డ్ ను తెలుగులో  పెట్టాలి. అగ్రి హబ్ లో తెలుగులోనే మాట్లాడాలి..’’ అని మంత్ర కేటీఆర్ అన్నారు. మన రాష్ట్రంలో 20లక్షల ఎకరాల లో ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రైతు వేదికలకు టి ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని, వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగే ప్రతి కార్యక్రమంను రైతు వేదికలో ప్రసారం అయ్యేటట్లు చూస్తామన్నారు. వ్యవసాయరంగంలో మరింత పరిశోధనలు పెరగాలని మంత్రి కేటీఆర్ కోరారు. 
త్వరలోనే వేరుశనగ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ  ఒక్క వ్యవసాయ రంగం పైనే 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ పరిశోధనలు ఇంకా పెరగాలి, ప్రపంచ స్థాయి పరిశోధనలు ఇక్కడ జరగాలి, వాటి సరసన మన యూనివర్సిటీ చేరాలని కోరారు. త్వరలోనే సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వేరుశనగ పరిశోధన కేంద్రానికి శంకుస్థాపన చేస్తామన్నారు. పంట మార్పిడి జరగాలి, నూనె గింజల ఉత్పత్తి పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అయితే ఇప్పటికే రాష్ట్రంలో నూనె గింజల ఉత్పత్తి సాగు పై నిర్ణయం తీసుకున్నామన్నారు. వ్యవసాయ పరిశోధన లకు 100 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. కొత్త అవిష్కరణతో వ్యవసాయ రంగం ను ముందుకు తీసుకుపోవాలి, వర్సిటీ అధికారులు కొత్త పరిశోధన లపై దృష్టి సారించాలని మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు.