స్ట్రాబెర్రీ కాదు.. ఇది లిచి!

స్ట్రాబెర్రీ కాదు.. ఇది లిచి!

చూడ్డానికి ఎర్రగా స్ట్రాబెర్రీలా కనిపిస్తుంది. లోపల చూస్తే తెల్లగా తాటి ముంజెను గుర్తుచేస్తుంది. రుచి, వాసనతో ఆకట్టుకుంటుంది. దీన్ని తింటే ఆరోగ్యానికి చాలా మేలు. కాకపోతే ఎలా తినాలో? ఎప్పుడు తినాలో తెలుసుకుని తినాలి. ఎందుకు? తెలుసుకోవాలంటే ఇది చదవాల్సిందే.

లిచి పండు సమ్మర్​ స్పెషల్​గా అట్రాక్ట్ చేస్తోంది. ఇది చైనా దేశానికి చెందింది. కానీ, ఇప్పుడు ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో వీటిని సాగు చేస్తున్నారు. చైనా, థాయ్​లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా దేశాలతోపాటు నార్త్​ ఇండియాలో కూడా పండిస్తున్నారు. ముఖ్యంగా బిహార్​లో వీటిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఈ పండ్లను చెట్ల రెమ్మల నుంచి తెంపిన వెంటనే వాటి సువాసన, తాజాదనం కోల్పోతాయి. అందుకే ఈ పండ్లను రెమ్మలతో పాటు తెంపుతారు. 

ఈ లిచి పండ్లు పైన ఎర్రగా స్ట్రాబెర్రీలా ఉంటుంది. దాన్ని లోపల చూస్తే, తెల్లటి పదార్థం కనిపిస్తుంది. అది అచ్చం తాటిముంజెల్లానే ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా ఎక్కువే. లిచి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. లిచిలో ఉండే కాపర్, ఐరన్​ ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తాయి.

 అంతేకాదు, హైబీపీని కంట్రోల్​ చేయడంలో కూడా బాగా పనిచేస్తాయి. వీటిలో విటమిన్​ –సి ఉంటుంది. అంటే శరీరానికి ఒక రోజుకి కావాల్సిన ఆస్కార్బిక్ యాసిడ్​ ఇందులో ఉంటుంది. లిచిలో ఫైబర్​ కూడా ఎక్కువే. డైజెషన్, గ్యాస్ట్రిక్​ ప్రాబ్లమ్స్​కు చెక్​ పెడుతుంది. లిచి పండ్లలో గుండెకు ఆరోగ్యాన్నిచ్చే పాలిపినాల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ఉండే బీటా కెరోటిన్, ఓలిగోనల్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే ఇందులో పొటాషియం రక్తనాళాలను హెల్దీగా ఉంచుతుంది. వాటి సంకోచ, వ్యాకోచాలను మెరుగ్గా ఉంచుతుంది. వృద్ధాప్య ఛాయలను తొలగించడంలో లిచి సాయపడుతుంది. బరువు పెరగకూడదంటే లిచి తినాల్సిందే. ఎందుకంటే వీటిలో నీటిశాతం ఎక్కువ. కాబట్టి వీటిని తింటే కొవ్వు పెరగదు. అంతేకాదు... ఎముకలు ఆరోగ్యంగా ఉంచుతుంది. లిచి పండ్లు తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్‌‌ సమస్య ఉండదు. ఆస్తమా, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ లిచి మంచిదే. తెల్ల రక్త కణాల పనితీరును మెరుగు పరిచేందుకు లిచి సహకరిస్తుంది. శరీరంలోని బాక్టీరియాలు, వైరస్‌‌లను నాశనం చేస్తుంది.

ఇవి చూసుకుని తినాలి

మామూలు పండ్లతో పోలిస్తే లిచి కాస్త డిఫరెంట్. పరగడుపున లేదా రాత్రి పడుకోబోయే ముందు అస్సలు తినకూడదు. ఎందుకంటే ఖాళీ కడుపుతో లేదా న్యూట్రిషన్ లోపం ఉంటే శరీరంలో షుగర్ లెవల్స్ తక్కువ ఉంటాయి. అలాంటప్పుడు ఇవి తింటే ఇంకా తగ్గుతాయి. దీనివల్ల ప్రాణాలకే ప్రమాదం. అలాగే పచ్చి లిచి పండ్లు అస్సలు తినకూడదు. ఎందుకంటే వాటిలో మిథిలెన్ సైక్లోప్రోపిల్–గ్లైసిన్​ (ఎంసిపిజి) అనే కెమికల్ ఉంటుంది. ఇది మెదడు పనితీరును దెబ్బతీస్తుంది. దాంతో మెదడువాపు వచ్చే ముప్పు ఉంది. 

తాటి ముంజలు తింటే..

తాటిముంజలు సౌత్ ఏసియా, సౌత్​ఈస్ట్ ఏషియాలకు చెందింది. వీటిని ఇంగ్లిష్​లో ఐస్ ఆపిల్స్‌‌ అని పిలుస్తారు. వేసవి కాలంలో మాత్రమే దొరికే ఈ ముంజలు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్–ఎ, బి, సి, ఐరన్, జింక్, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరంలోని ఉష్ణోగ్రత తగ్గి జీర్ణక్రియ పెరుగుతుంది. గ్యాస్, ఎసిడిటి, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుంచి రిలీఫ్​ ఇస్తుంది. ఈ తాటి ముంజల్లో కొవ్వు పదార్థాలు తక్కువ. అందుకే చిన్నపిల్లలకు, హార్ట్, షుగర్ పేషెంట్స్​కు మేలు చేస్తాయి. వీటిల్లో నీటి శాతం ఎక్కువ ఉండటం వల్ల వేసవిలో వడదెబ్బ తగలకుండా చేస్తాయి. ఇవి బాడీ టెంపరేచర్​ను తగ్గించి, శరీరాన్ని చల్లబరుస్తాయి. డీహైడ్రేషన్ బారిన పడకుండా చేస్తాయి. శరీర బరువు తగ్గించడంలో సాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. అందువల్ల రక్తపోటు అదుపులో ఉండి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శరీరంలోని హానికర వ్యర్థ పదార్థాలను తొలగిస్తాయి. లివర్ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. ఆడవాళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాలను అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. ట్యూమర్, బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను డెవలప్ చేసే పెట్రో కెమికల్స్, ఆంథో సయానిన్స్​ వంటి వాటిని తొలగిస్తాయి.గ్లూకోజ్ స్థాయిని పెంచి శరీరానికి కావాల్సిన మినరల్స్, న్యూట్రిన్ లను బ్యాలెన్స్ చేయడంలో ముంజలు కీలక పాత్ర పోషిస్తాయి. వేసవిలో ఎండ కారణంగా వచ్చే వికారం, వాంతులు, చికెన్ పాక్స్​ని నివారిస్తుంది.