
- విశ్వవేదికపై తెలంగాణ కీర్తి
- ‘తెలంగాణ జరూర్ ఆనా’ చిత్రానికి దక్కిన గౌరవం
- దూలం సత్యనారాయణకు తెలంగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు
72వ మిస్ వరల్డ్–2025 వేదికపై తెలంగాణ పర్యాటక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేసినందుకు ప్రముఖ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్ దూలం సత్యనారాయణకు ‘తెలంగాణ టూరిజం ఎక్సలెన్స్ అవార్డు’ లభించింది.
ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా శనివారం(సెప్టెంబర్27) హైదరాబాద్‌లో జరిగిన టూరిజం కాన్‌క్లేవ్‌లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, పర్యాటకసాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎఫ్.డి.సి ఛైర్మెన్ దిల్ రాజు, టూరిజం కార్పోరేషన్ ఛైర్మెన్ పటేల్ రమేశ్ రెడ్డి, డీజీపీ జితేందర్, టూరిజం ఎండీ ,ఎఫ్.డి.సి ఎండీ సమక్షంలో దూలం సత్యనారాయణ ఈ అవార్డును స్వీకరించారు.
ప్రపంచాన్ని ఆకట్టుకున్న డాక్యుమెంటరీ(ప్రచార) చిత్రం
మిస్ వరల్డ్–2025 వేడుకలతో అనుసంధానంగా రూపొందించిన ‘తెలంగాణ జరూర్ ఆనా’ డాక్యుమెంటరీ (ప్రచార) చిత్రం తెలంగాణ చారిత్రక–సాంస్కృతిక కీర్తిని విశ్వవేదికపై ప్రతిష్ఠాత్మకంగా నిలబెట్టింది.
ఈ చిత్రంలో రామప్ప దేవాలయం, పొచంపల్లి చేనేత, చార్మినార్ వంటి ఎన్నో అద్భుత ప్రదేశాలను 140 దేశాల నుంచి వచ్చిన మిస్ వరల్డ్ పోటీదారుల ఆకర్షణను అద్భుతంగా మిళితం చేశారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం..తెలంగాణను దక్షిణ భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన ప్రాంతంగా నిలిపింది.
అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన సృజనాత్మకుడు
15 ఏళ్లుగా డాక్యుమెంటరీ చిత్రాలలో విశేష అనుభవం కలిగిన దూలం సత్యనారాయణకు ఇప్పటికే పలు అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. 2023లో ‘పొచంపల్లి–విలేజ్ టూరిజం’ చిత్రానికి ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్రికాలో సిల్వర్ అవార్డు, 2019లో తెలంగాణ టూరిజం థీమ్ సాంగ్కు జపాన్ వరల్డ్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ ఫిల్మ్ అవార్డు, 2016లో వెల్‌కమ్ టు తెలంగాణ చిత్రానికి పోర్చుగల్‌లోని ఆర్ట్&టర్ ఇంటర్నేషనల్ టూరిజం ఫిల్మ్ ఫెస్టివల్లో బెస్ట్ టూరిజం ఫిల్మ్ అవార్డు లభించాయి. అంతేకాకుండా అమెరికా, కెనడా, యూరప్‌లలోని అనేక గ్లోబల్ ఫెస్టివల్స్‌లో జ్యూరీగా, ప్రతినిధిగా పాల్గొని తెలంగాణ పర్యాటకాన్ని అంతర్జాతీయ వేదికపై ప్రోత్సహించారు దూలం సత్యనారాయణ.
తెలంగాణ కథలతో ప్రపంచానికి పిలుపు
ప్రగతిశీల పర్యాటక విధానాలతో తెలంగాణ ప్రపంచ పర్యాటక హబ్‌గా ఎదుగుతున్న తరుణంలో సృజనాత్మక కథనాల శక్తి ద్వారా ఆర్థికాభివృద్ధి, సాంస్కృతిక మార్పిడికి తోడ్పడుతున్నందుకు ఈ అవార్డు ప్రతీకగా నిలిచింది.
తెలంగాణ కథలను ప్రపంచానికి చెబుతూనే ఉంటా.. దూలం
అవార్డు స్వీకరించిన సందర్భంగా దూలం సత్యనారాయణ మాట్లాడుతూ “తెలంగాణ పర్యాటక శాఖ ఈ గౌరవం అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది. మిస్ వరల్డ్ ఫెస్టివల్‌లో భాగస్వామ్యం కావడం ద్వారా తెలంగాణ ఆతిథ్యాన్ని, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగాం..ఈ గుర్తింపు మరిన్ని ప్రేరణాత్మక కథలను చెప్పడానికి నన్ను ఉత్తేజపరుస్తోందని అన్నారు దూలం.