ఇంకా డిసైడ్​ కాలేదు.. ‘జీరో టారీఫ్’పై ఇప్పుడే స్పందించడం సరికాదు: జైశంకర్​

ఇంకా డిసైడ్​ కాలేదు.. ‘జీరో టారీఫ్’పై ఇప్పుడే స్పందించడం సరికాదు: జైశంకర్​
  • సీజ్​ఫైర్​ కోరుకున్నది ఎవరో అందరికీ తెలుసు
  • పాక్​ ఉగ్రవాదం ఆపేదాకా.. సింధూ ఒప్పందం రద్దు 
  • కొనసాగుతదని వ్యాఖ్య

న్యూఢిల్లీ:  అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన ‘జీరో టారిఫ్’ కామెంట్లపై ఇప్పుడే స్పందించడం సరికాదని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. ఇండియా, అమెరికా ట్రేడ్ డీల్ చాలా సంక్లిష్టమైందని అన్నారు. చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. వాణిజ్యపరమైన ప్రతి అంశంపై నిర్ణయం తీసుకునేవరకు చర్చలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. ట్రేడ్ డీల్ అనేది పరస్పరం ప్రయోజనకరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పటి దాకా ట్రంప్ చేసిన ‘జీరో టారిఫ్’ కామెంట్లపై మాట్లాడటం తొందరపాటే అవుతుందని వివరించారు. దీనిపై భారత్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. 

కాగా, పాక్ తో భవిష్యత్తులో కేవలం టెర్రరిజంపైనే చర్చలు జైశంకర్ స్పష్టం చేశారు. ఇక నుంచి ఆ దేశంతో భారతదేశ సంబంధాలు ద్వైపాక్షికంగానే ఉంటాయన్నారు. గురువారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పాకిస్తాన్‌‌‌‌లోని సైనిక స్థావరాలకు జరిగిన నష్టాన్ని చూపిస్తున్న ఉపగ్రహ చిత్రాలను మీడియాకు చూపించారు. ‘‘పాకిస్తాన్ ఉగ్రవాదులను అప్పగించాలి. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను శాశ్వతంగా మూసివేయాలి. 

అందుకు ఏమి చేయాలో వారికి తెలుసు. అలాగే, కాశ్మీర్‌‌‌‌పై చర్చించాల్సిన ఏకైక విషయం ఏమిటంటే.. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌‌‌‌లో చట్టవిరుద్ధంగా ఆక్రమించిన భారత భూభాగాన్ని వదిలివేయడం. ఈ విషయంలో  చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము" అని జైశంకర్ అన్నారు. పాక్ ఉగ్రవాదాన్ని ఆపేదాకా సింధూ జలాల ఒప్పందం రద్దు కొనసాగుతుందని ఆయన తేల్చిచెప్పారు.