- కవితను కాంగ్రెస్‌లో చేర్చుకునేది లేదు: మహేశ్ గౌడ్
- రేవంత్ విదేశాల్లో ఉన్నప్పుడు మంత్రులు భేటీ అయితే తప్పేంటి?
- డిప్యూటీ సీఎం హోదాలో భట్టి మీటింగ్ పెట్టారు
- నైనీ బ్లాక్ టెండర్ల వివాదంపై పారదర్శకంగా విచారణ జరపాలి
- 12 ఏండ్లుగా తెలంగాణను కేంద్రం పట్టించుకోవట్లేదని పీసీసీ చీఫ్ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో అపోజిషన్ పార్టీ నేతలే లక్ష్యంగా జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న అందరికీ నోటీసులు ఇవ్వాల్సిందే అని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అత్యంత హేయమైన చర్య అని, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
విచారణకు ఇంకా ఎవరెవరిని పిలుస్తారనే విషయం తనకు తెలియదని చెప్పారు. ఢిల్లీలోని పార్టీ హెడ్ ఆఫీస్ ఇందిరా భవన్ లో ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ (సంస్థాగత) కేసీ వేణుగోపాల్ నేతృత్వంలో పార్టీ సంస్థాగత పటిష్ఠతపై సోమవారం కీలక భేటీ జరిగింది. ‘కాంగ్రెస్ సంఘటన్ సృజన్ అభియాన్’లో భాగంగా నిర్వహించిన ఈ మీటింగ్ లో.. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ నేతలు, పలు రాష్ట్రాల పీసీసీలు పాల్గొన్నారు.
తెలంగాణ నుంచి ఈ మీటింగ్ లో మహేశ్ గౌడ్ హాజరయ్యారు. ఈ మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల నియామకం పూర్తయింది. జిల్లా కమిటీల నియామకాలు వారం పది రోజుల్లో కంప్లీట్ అవుతాయి. పార్టీని గ్రామ, మండల, బ్లాక్, జిల్లా స్థాయి వరకు బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన అంశాలపై చర్చించాం.
రానున్న 3 నెలల్లో గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పటిష్టం చేస్తాం. సర్ పేరుతో కేంద్రం చేస్తున్న ఓట్ల చోరీని అడ్డుకునేందుకు సమర్థవంతమైన ప్రణళికపై కసరత్తు చేశాం’’అని మహేశ్ గౌడ్ తెలిపారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మాట్లాడుకున్నరు!
సీఎం రేవంత్ అమెరికాలో ఉన్న టైమ్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసమైన ‘ప్రజాభవన్’లో మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు, అడ్లూరి సమావేశం అయ్యారని, ఎట్ హోం ముగిశాక ఒకే కారులో ముగ్గురు మంత్రులు భట్టి ఇంటికి వెళ్లడం వెనుక ఆంతర్యమేంటని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్‌ను మీడియా ప్రశ్నించగా.. ‘‘ముగ్గురు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబు, అడ్లూరితో డిప్యూటీ సీఎం హోదాలో భట్టి సమావేశం అయ్యింది నిజమే.
మీటింగ్ పెడ్తే తప్పేంటి? సీఎం విదేశీ పర్యటనలో ఉన్నరు. నలుగురు కామన్‌గానే మీట్ అయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై మంత్రులతో భట్టి సమావేశం నిర్వహించి ఉంటారని నేను భావిస్తున్న’’అని మహేశ్ గౌడ్ తెలిపారు. కవితను కాంగ్రెస్‌లో చేరుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా.. ‘‘కవిత కాంగ్రెస్‌లో చేరాలనే ప్రతిపాదన ఏఐసీసీలో వచ్చినప్పుడు నేనే వ్యతిరేకించిన. ఇది నిజం.
కవిత కుటుంబ సభ్యులను కాంగ్రెస్‌లో తీసుకోవద్దని నేనే చెప్పిన. వారి కుటుంబ, ఆస్తి తగాదాల్లో తలదూర్చాల్సిన అవసరం మనకు లేదని చెప్పిన. అప్పుడు.. ఇప్పుడూ.. ఇదే నా అభిప్రాయం’’అని మహేశ్ గౌడ్ స్పష్టం చేశారు.
రూ.7 లక్షల కోట్ల అప్పుల భారం మోస్తున్నం
తెలంగాణపై కేసీఆర్ రూ.7లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోపారని మహేశ్ గౌడ్ అన్నారు. ‘‘ఉపాధి హామీని కేంద్రం భ్రష్టు పట్టిస్తున్నది. రాష్ట్రంపై ఎలాంటి భారం వేయకుండా సామాన్యుడికి న్యాయం చేయాలి. గాంధీజీ పేరును తొలగించడం దారుణం.
పేదలకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసినం. నిధుల్లో కోత, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు లబ్ధి పొందే పథకంలో మార్పులకు వ్యతిరేకంగా రాస్తారోకోలు చేయాలని నిర్ణయించినం. నైనీ కోల్ బ్లాక్ టెండర్ల వివాదంపై పారదర్శకంగా విచారణ చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి 5 రోజుల కిందే లేఖ రాసినం.
బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన టెండర్లన్నింటిపైనా రివ్యూ చేయాలని ఆ లేఖ ద్వారా కోరినం. రెండేండ్లలో జరిగిన టెండర్లపై కూడా విచారణ చేయాలని, వాస్తవాలన్నీ తేలాలని మేమే కోరుతున్నం. గత పదేండ్లలోనే అవినీతి జరిగింది. ఇప్పుడు ఆరోపణలు వస్తున్న కాంట్రాక్టర్లంతా బీఆర్‌ఎస్ హయాంలోనే లబ్ధి పొందారు’అని మహేశ్ గౌడ్ అన్నారు.
