సిక్కు వివాహాల రిజిస్ట్రేషన్‌‌కు రూల్స్ నోటిఫై చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం

సిక్కు వివాహాల రిజిస్ట్రేషన్‌‌కు రూల్స్ నోటిఫై చేయండి: సుప్రీంకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: సిక్కుల వివాహాల (ఆనంద్‌‌ కరజ్‌‌) రిజిస్ట్రేషన్‌‌ కోసం రూల్స్‎ను 4 నెలల్లోగా నోటిఫై చేయాలని పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. సిక్కుల వివాహాలు ఇతర వివాహాలతో సమానంగా రిజిస్ట్రేషన్‌‌ చేసుకునేలా అవకాశం ఉండాలని సుప్రీంకోర్టు జడ్జిలు జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన బెంచ్ అభిప్రాయపడింది. ఆనంద్‌‌ కరజ్‌‌ను చట్టం గుర్తించినప్పటికీ రిజిస్ట్రేషన్‌‌ వ్యవస్థ లేకపోతే అది అసంపూర్ణం అవుతుందని పేర్కొంది.

 ఆనంద్ మ్యారేజ్ యాక్ట్, 1909లోని సెక్షన్‌‌ 6 ప్రకారం.. రాష్ట్రాలు వివాహ రిజిస్ట్రేషన్ నియమాలను రూపొందించాలన్న ఆదేశాలను కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు పాటించడంలేదంటూ దాఖలైన పిటిషన్‌‌పై కోర్టు ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సమన్వయకర్తగా వ్యవహరించాలని సూచించింది. 

‘ముస్లింతో దసరా ఉత్సవాల’పై పిటిషన్..   

మైసూరులో ఈ నెల 22 నుంచి జరగనున్న దసరా ఉత్సవాలను ప్రారంభించేందుకు ముస్లిం మహిళను ఆహ్వానించడాన్ని సవాల్‌‌ చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం పిటిషన్‌‌ దాఖలైంది. దీనిని అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ కోరగా.. సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్‎తో కూడిన బెంచ్ అంగీకరించింది. మైసూరు దసరా ఉత్సవాలను ప్రారంభించేందుకు చీఫ్‌‌ గెస్ట్‌‌గా కన్నడ రచయిత, బుకర్‌‌‌‌ ప్రైజ్‌‌ గ్రహీత బాను ముష్తాక్‌‌ను ఆహ్వానించాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం సరికాదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌‌ దాఖలుకాగా, దీనిని కోర్టు ఈ మేరకు విచారణకు స్వీకరించింది.