మెల్బోర్న్: సెర్బియా టెన్నిస్ లెజెండ్ నొవాక్ జొకోవిచ్ తన ఫేవరెట్ కోర్టులో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సోమవారం జరిగిన ఆస్ట్రేలియన్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో 6–-3, 6–-2, 6–-2తో స్పెయిన్‌కు చెందిన పెడ్రో మార్టినెజ్‌ను వరుస సెట్లలో చిత్తు చేసి 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటను ఘనంగా ప్రారంభించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో నొవాక్‌కు ఇది వందో విజయం. దాంతో మూడు రకాల కోర్టుల్లో (క్లే, హార్డ్, గ్రాస్) గ్రాండ్‌స్లామ్స్‌లో వంద అంతకంటే ఎక్కువ విజయాలు సాధించిన తొలి ప్లేయర్‌గా రికార్డుకెక్కాడు.
ఇతర మ్యాచ్‌ల్లో 11వ సీడ్ మెద్వెదేవ్ (రష్యా) 7–5, 6–2, 7–6 (7/2)తో జాస్పర్ డి జాంగ్‌ను, ఆరో సీడ్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా ) 6–2, 6–2, 6–3తో మెకెంజీ మెక్‌డొనాల్డ్‌ను, 12వ సీడ్ కాస్పర్ రూడ్ (నార్వే) 6–1, 6–2, 6–4తో బెల్లుచి (ఇటలీ)ని, 19వ సీడ్ టామీ డి పాల్ (అమెరికా) 6–4, 6–3, 6–3తో తమ దేశానికే చెందిన అలెక్సాండర్ కొవసెవిచ్‌ను ఓడించారు. విమెన్స్ సింగిల్స్‌లో రెండో సీడ్ స్వైటెక్ (పోలాండ్) 7-–6 (7/5), 6-–3తో చైనా క్వాలిఫయర్ యువాన్ యుయేపై నెగ్గగా, మూడో సీడ్ కోకో గాఫ్ (అమెరికా) 6-–2, 6–-3తో కమిల్లా రఖిమోవా (ఉజ్బెకిస్తాన్) గెలిచింది. అయితే, 2020 చాంపియన్ సోఫియా కెనిన్‌కు షాక్ తగిలింది. అమెరికాకే చెందిన పేటన్ స్టెర్న్స్ 6–3, 6–2తో కెనిన్‌ను ఓడించింది.
