
కెరీర్‌లో 25వ గ్రాండ్‌స్లామ్ వేటలో ఉన్న సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జొకోవిచ్‌కు.. ఫ్రెంచ్ ఓపెన్‌లో అనూహ్య పరాజయం ఎదురైంది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ సెమీస్‌లో ఆరోసీడ్ జొకోవిచ్ 4–6, 5–7, 6–7 (3/7)తో టాప్‌సీడ్ జానిక్ సినర్ (ఇటలీ) చేతిలో కంగుతిన్నాడు. 3 గంటలా 16 నిమిషాల మ్యాచ్‌లో తొలి రెండు సెట్లను కోల్పోయిన సెర్బియన్ మూడోసెట్‌లో పుంజుకున్నాడు. కానీ టైబ్రేక్‌లో సినర్ ధాటిని అధిగమించలేకపోయాడు. దాంతో కెరీర్‌లో 38వ సారి, రోలాండ్ గారోస్‌లో ఎనిమిదోసారి గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరాలన్న అతని కల నెరవేరలేదు. మూడుసార్లు ఇక్కడ విన్నర్‌గా నిలిచిన జొకో సెమీస్ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఎక్కువ భాగం బేస్‌లైన్ ఆటతో సినర్‌ను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేసినా సక్సెస్ కాలేదు.
ఇక్కడ నా చివరి మ్యాచ్ ఇదే కావొచ్చు: నొవాక్
ఓటమితో ఒకింత భావోద్వేగానికి గురైన జొకో ఫ్రెంచ్ ఓపెన్‌లో ఇదే తన చివరి మ్యాచ్ అవ్వొచ్చని చెప్పాడు. ‘సెమీస్‌లో నేను నిరంతరం ఒత్తిడిలో ఉన్నానని భావించాను. సినర్ బంతిని స్వింగ్ చేయడానికి నాకు సమయం ఇవ్వలేదు. అతను నిరంతరం లైన్‌లోనే ఉన్నాడు. నన్ను డిఫెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకే సినర్ వరల్డ్ నంబర్‌వన్ అయ్యాడు’ అని జొకో పేర్కొన్నాడు. ఇక యూఎస్, ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన తర్వాత తన గ్రాండ్‌స్లామ్ విజయ పరంపరను 20 మ్యాచ్‌లకు పెంచుకున్న సినర్.. జొకోతో సెమీస్ ఆడటం చాలా ప్రత్యేకమైన క్షణాలని పేర్కొన్నాడు.