ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో టాప్ సీడ్ నొవాక్

ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌ ప్రిక్వార్టర్స్‌‌లో టాప్ సీడ్ నొవాక్
  •     సబలెంక, గాఫ్‌‌, సినెర్‌‌, సిట్సిపాస్‌‌ కూడా ముందంజ
  •     మూడో రౌండ్‌‌లో రోహన్ బోపన్న జోడీ

మెల్‌‌బోర్న్‌‌: వరల్డ్‌‌ నంబర్‌‌వన్‌‌, సెర్బియా సూపర్‌‌ స్టార్‌‌ నొవాక్‌‌ జొకోవిచ్‌‌.. తనకు అచ్చొచ్చిన ఆస్ట్రేలియన్‌‌ ఓపెన్‌‌లో దూసుకుపోతున్నాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ మూడో రౌండ్‌‌లో టాప్‌‌సీడ్‌‌ జొకోవిచ్‌‌ 6–3, 6–3, 7–6 (7/2)తో 30వ సీడ్‌‌ థామస్‌‌ మార్టిన్‌‌ ఎట్చెవెరి (అర్జెంటీనా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌లో అడుగుపెట్టాడు. మెల్‌‌బోర్న్‌‌ పార్క్‌‌లో జొకోకు ఇది వందో మ్యాచ్‌‌ కాగా, 98 విజయాలతో మూడో ప్లేస్‌‌లో కొనసాగుతున్నాడు. రోజర్‌‌ ఫెడరర్‌‌ (117), సెరెనా విలియమ్స్‌‌ (105) ముందున్నారు.

ఇక ఈ టోర్నీలో నొవాక్‌కు ఇది వరుసగా 31వ విజయం కావడం విశేషం. ఎట్చెవెరితో 2 గంటల 28 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌లో జొకో తన ట్రేడ్‌‌ మార్క్‌‌ షాట్లతో చెలరేగాడు. 24 ఏళ్ల అర్జెంటీనా ప్లేయర్‌‌ సర్వీస్‌‌లకు ఈజీగా బదులిచ్చాడు. దీంతో ఒక్క బ్రేక్‌‌ పాయింట్‌‌కూడా కోల్పోలేదు. తన సర్వీస్‌‌ల్లోనూ నియంత్రణ చూపెట్టిన జొకో.. తొలి సెట్‌‌ ఆరో గేమ్‌‌లో ఎట్చెవెరి సర్వీస్‌‌ను బ్రేక్‌‌ చేసి 4–2 లీడ్‌‌లోకి వెళ్లి ఈజీగా సెట్‌‌ను ముగించాడు. రెండో సెట్‌‌లోనూ ఎటాకింగ్‌‌ గేమ్‌‌ ఆడిన జొకోవిచ్‌‌ 2–1 లీడ్‌‌తో ముందుకెళ్లాడు.

దాన్ని కాపాడుకుంటూ రెండో సెట్‌‌నూ సొంతం చేసుకున్నాడు. అయితే మూడో సెట్‌‌లో ఎట్చెవెరి పుంజుకోవడంతో టైబ్రేక్‌‌కు వెళ్లింది. టైబ్రేక్‌‌లో జొకో తన మార్కు పవర్ ఫుల్ షాట్లతో ఎట్చెవెరిని నిలువరించి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఇతర మ్యాచ్‌‌ల్లో జానిక్‌‌ సినర్‌‌ (ఇటలీ) 6–0, 6–1, 6–3తో సెబాస్టియన్‌‌ బాజ్‌‌ (అర్జెంటీనా)పై, ఆండ్రీ రబ్లెవ్‌‌ (రష్యా) 6–2, 7–6 (8/6), 6–4తో కోర్డా (అమెరికా)పై, సిట్సిపాస్‌‌ (అర్జెంటీనా) 6–3, 6–0, 6–4తో లుకా వాన్‌‌ అసెచి (ఫ్రాన్స్‌‌)పై, అలెక్స్‌‌ డి మినార్‌‌ (ఆస్ట్రేలియా)6–3, 6–3, 6–1తో ఫ్లావో కొబోలి (ఇటలీ)పై, ఫ్రిట్జ్‌‌ (అమెరికా) 3–6, 6–4, 6–2, 6–2తో ఫ్యాబియన్‌‌ మర్జోసాన్‌‌ (హంగేరి)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌‌లోకి ప్రవేశించారు. విమెన్స్‌‌ సింగిల్స్‌‌ మూడోరౌండ్‌‌లో రెండోసీడ్‌‌  సబలెంకా (బెలారస్‌‌) 6–0, 6–0తో లీసియా సురెంకో (ఉక్రెయిన్‌‌)పై, కోకో గాఫ్‌‌ (అమెరికా) 6–0, 6–2తో పార్క్స్‌‌ (అమెరికా)పై, క్రెజికోవా (చెక్‌‌) 4–6, 7–5, 6–3తో హంటర్‌‌ (ఆస్ట్రేలియా)పై గెలవగా, 10వ సీడ్‌‌ హడాడ్‌‌ మయా (బ్రెజిల్‌‌) 6–7 (7/9), 3–6తో మరియా తిమోఫివా (రష్యా) చేతిలో ఓడింది. 

బోపన్న జోడీ ఈజీగా..

ఇండియా స్టార్‌‌ ప్లేయర్‌‌ రోహన్‌‌ బోపన్న మెన్స్‌ డబుల్స్‌లో  మూడో రౌండ్‌‌లోకి అడుగుపెట్టాడు.  రెండోరౌండ్‌‌లో రెండోసీడ్‌‌ బోపన్న– మాథ్యూ ఎబ్డెన్‌‌ (ఆస్ట్రేలియా) 6–2, 6–4తో జాన్‌‌ మిల్‌‌మన్‌‌–ఎడ్వర్డ్‌‌ వింటర్‌‌ (ఆస్ట్రేలియా)పై గెలిచారు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండో–ఆసీస్‌‌ జోడీ గంటలోనే ప్రత్యర్థులకు చెక్‌‌ పెట్టింది.

తమ సర్వీస్‌‌లో 80 శాతం పాయింట్లు సాధించింది. ఈ మ్యాచ్‌‌లో బోపన్న  జంట 203 కేఎంపీహెచ్‌‌ వేగంతో సర్వీస్‌‌ చేసి రికార్డు సృష్టించింది. 17 విన్నర్లతో ఈజీగా మ్యాచ్‌‌ను చేజిక్కించుకుంది. తొలి రౌండ్‌‌ మ్యాచ్‌‌లో శ్రీరామ్‌‌ బాలాజీ (ఇండియా)–విక్టర్‌‌ వ్లాడ్‌‌ కొర్నియా (రొమేనియా) 6–3, 6–4తో మాట్టె ఆర్నాల్డి–ఆండ్రియా పెల్లెగ్రినో (ఇటలీ)పై నెగ్గి రెండోరౌండ్‌‌లోకి ప్రవేశించారు. ఓ గ్రాండ్‌‌స్లామ్‌‌లో రెండోరౌండ్‌‌ చేరడం బాలాజీకి ఇది రెండోసారి.