కేఆర్ఎంబీ ఆధీనంలోకి నాగార్జున సాగర్

కేఆర్ఎంబీ ఆధీనంలోకి నాగార్జున సాగర్

హైదరాబాద్, వెలుగు: నాగార్జున సాగర్​ప్రాజెక్టును తాత్కాలికంగా కేఆర్ఎంబీ తమ ఆధీనంలోకి తీసుకుంది. సోమవారం కేఆర్ఎంబీ మెంబర్​ అజయ్​కుమార్​, ఈఈలు రఘునాథ్, శివశంకరయ్య ప్రాజెక్టును సందర్శించారు. సాగర్​ ఐదు, ఏడో నంబర్ ​గేట్లు ఎత్తి ఏపీకి నీటిని విడుదల చేశారు. ఏపీ రీ ఆర్గనైజేషన్​ యాక్ట్​ ప్రకారం నాగార్జున సాగర్​ ప్రాజెక్టు ఆపరేషన్స్​​ తాత్కాలికంగా తెలంగాణ ఆధీనంలో ఉన్నాయి. ఏపీకి కేటాయించిన నీటిలో ఐదు టీఎంసీలు నాగార్జున సాగర్ నుంచి ఇచ్చేందుకు ఇటీవల అనుమతి ఇచ్చారు. తమకు ఆ నీటిని విడుదల చేయాలని ఏపీ కోరడంతో సోమవారం ఉదయం నీటి విడుదలపై హైడ్రామా చోటు చేసుకుంది. ఈఎన్సీ (జనరల్) మురళీధర్, నాగార్జున సాగర్​సీఈ అజయ్​కుమార్ కేఆర్ఎంబీ చైర్మన్ శివ్​నందన్​కుమార్​తో సమావేశమయ్యారు. చట్ట ప్రకారం ప్రాజెక్టు ఆపరేషన్​తామే చేయాల్సి ఉంటుందని, లేనిపక్షంలో బోర్డు అధికారులు మాత్రమే నీటిని విడుదల చేయాలని కోరారు. 

అలాకాకుండా ఏపీ అధికారులు నీటిని విడుదల చేస్తే అంగీకరించబోమన్నారు. కేఆర్ఎంబీ చైర్మన్ వెంటనే బోర్డు మెంబర్​సహా ఇద్దరు ఈఈలను ప్రాజెక్టు వద్దకు పంపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని గంటల ముందు (గతేడాది నవంబర్​29న అర్ధరాత్రి) ఏపీ పోలీసులతో సహా ఆ రాష్ట్ర ఇంజనీర్లు ప్రాజెక్టు పైకి అక్రమంగా చొచ్చుకువచ్చి గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. ఇలా తరలించిన 1.07 టీఎంసీలను మినహాయించి 3.03 టీఎంసీలను బోర్డు పర్యవేక్షణలో తరలించనున్నారు. ఆ తర్వాత బోర్డు అధికారులే ప్రాజెక్టు గేట్లు మూసేయనున్నారు. సాగర్​కుడి కాలువ గేట్లను ఏపీ స్వాధీనం చేసుకొని అక్రమంగా నీటిని విడుదల చేయడంతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి రెండు రాష్ట్రాల సీఎస్​లు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించి తదుపరి ఆదేశాలు ఇచ్చి ప్రాజెక్టు వద్ద యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించారు. ప్రాజెక్టు నిర్వహణను తాత్కాలికంగా కేఆర్ఎంబీకి అప్పగించాలని తేల్చిచెప్పారు. 

వెంటనే సీఆర్పీఎఫ్​బలగాలను ప్రాజెక్టుపై మోహరించారు. ప్రాజెక్టు నిర్వహణ అంశంపై రెండు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కోసం కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన సమావేశం నిర్వహించాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఏపీ అధికారులు కుడి కాలువ నుంచి నీటిని విడుదల చేయడానికి వారం రోజులుగా ప్రయత్నిస్తుండగా సీఆర్పీఎఫ్​బలగాలు అడ్డుకుంటున్నాయి. సోమవారం బోర్డు జోక్యంతో ఏపీకి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్వహణపై చర్చించేందుకు మంగళవారం రెండు రాష్ట్రాల అధికారులతో కేఆర్ఎంబీ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.