దుంప కూరగాయలతోనే పోషకాహార భద్రత: హార్టికల్చర్​ వీసీ రాజిరెడ్డి

దుంప కూరగాయలతోనే పోషకాహార భద్రత: హార్టికల్చర్​ వీసీ రాజిరెడ్డి

హైదరాబాద్, వెలుగు: దుంప కూరగాయలైన బంగాళదుంప, స్వీట్ పొటాటో, క్యారెట్, బీట్‌రూట్ ‎లతోనే పోషకాహార భద్రత ఉంటుందని హార్టికల్చరల్ యూనివర్సిటీ వీసీ దండ రాజిరెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఉన్న హార్టికల్చర్​ కాలేజీలో ‘అఖిల భారత పంటల సమన్వయ పరిశోధన పథకం’ 25వ వార్షిక సదస్సు సోమవారం జరిగింది. కేరళలోని దుంప కూరగాయల పరిశోధన సంస్థ, తెలంగాణ కూరగాయల పరిశోధన కేంద్రం సంయుక్తంగా సోమ, మంగళవారాల్లో ఈ సదస్సు నిర్వహిస్తున్నాయి. 

సదస్సుకు అధ్యక్షత వహించిన దండ రాజిరెడ్డి మాట్లాడుతూ.. ఉద్యాన పంటలతో రైతు కుటుంబాలకు నెలకు రూ.13 నుంచి-14 వేల ఆదాయం వస్తుందని ఇటీవలి అధ్యయనంలో తేలిందన్నారు. ఐసీఏఆర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సంజయ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ..సేంద్రియ ఎరువులు, బొటానికల్స్ వాడితే  దుంప కూరగాయల సాగు లాభదాయకంగా మారుతుందన్నారు.  ఐసీఏఆర్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ సుధాకర్ పాండే, శాస్త్రవేత్తలు, నిపుణులు పాల్గొన్నారు.