- ఓయూ ఎంబీఏ అల్యూమ్నీ మీట్ లో ప్రభుత్వ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి సూచన
హైదరాబాద్, వెలుగు: దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు యువత, మేనేజ్‌మెంట్ నిపుణులు కొత్త ఆలోచనలతో ఆవిష్కరణలు చేయాలని, తమ ఐడియాలకు పదును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వ అర్బన్ ట్రాన్స్ పోర్ట్ సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఎంబీఏ పూర్వ విద్యార్థుల అల్యూమ్నీ సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
2047 నాటికి భారతదేశాన్ని 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయన్నారు. ఈ లక్ష్య సాధనలో మేనేజ్‌మెంట్ ప్రాక్టీషనర్లు తమ రంగాల్లో రాణించి యువతరానికి రోల్ మోడల్ గా నిలవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పీపీపీ ప్రాజెక్టు అయిన హైదరాబాద్ మెట్రో రైలు నిర్మాణం అంత ఆషామాషీగా జరగలేదని ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.
ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నప్పుడు ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని, వాటన్నింటినీ సందర్భోచిత నిర్ణయాలతో పరిష్కరించామని వివరించారు. ఒక సక్సెస్ ఫుల్ లీడర్ గా ఎదగాలంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ తో పాటు వేగంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, నిజాయితీ, సమగ్రత ఉండాలని విద్యార్థులకు ఆయన సూచించారు. అనంతరం ఎంబీఏలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆయన మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఓయూ ఎంబీఏ అల్యూమ్ని అసోసియేషన్ అధ్యక్షురాలు జ్యోత్స్న, రిజిస్ట్రార్ జి.నరేష్ రెడ్డి, అసోసియేషన్ ఫస్ట్ బ్యాచ్ మెంబర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శ్యామ్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
