- కాంగ్రెస్, బీఆర్ఎస్ది ఉత్తుత్తి కుస్తీ.. లోపల దోస్తీ: ఎన్వీఎస్ఎస్
హైదరాబాద్, వెలుగు: రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ఇప్పటివరకు 60 సార్లు ఢిల్లీకి వెళ్లారని, తన పదవిని కాపాడుకోవడానికే ఆయనకు సరిపోతోందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. పాలన చేతకాకనే ఐఏఎస్, ఐపీఎస్ లను ఇప్పటికి 60 సార్లు బదిలీ చేశారని విమర్శించారు. అధికారులను ఇన్నిసార్లు మార్చడం వల్ల రాష్ట్రంలో పాలన కుంటుపడిందన్నారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ నగరాన్ని ప్రభుత్వం మూడు ముక్కలు చేసి మూడు ముక్కలాట ఆడుతోందని విమర్శించారు.
ప్రభుత్వానికి అసలు విజన్ లేదని, మిషన్ అంతకంటే లేదని.. వారిది కేవలం కమీషన్ల ప్రభుత్వం మాత్రమేనని ఎద్దేవా చేశారు. రాబోయే పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్‌ది కేవలం ఉత్తుత్తి పోటీ అన్నారు. రాజ్యసభ ఎన్నికలు బీఆర్ఎస్‌కు ఒక మంచి అవకాశమని, దమ్ముంటే ఆ పార్టీ అభ్యర్థులను పోటీకి దింపాలని సవాల్ విసిరారు. దమ్ముంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవాలని లేదంటే బీఆర్ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని సూచించారు.
