న్యూఢిల్లీ, వెలుగు: రాజ్యాంగ బద్ధంగా ఏర్పడిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై అసత్య ప్రచారాలు చేస్తున్న కుట్రలను సాగనివ్వబోమని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఓసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఓసీల న్యాయమైన డిమాండ్ల సాధనకు సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఓసి జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఓసీల మహాధర్నాను నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు జాతీయ స్థాయి ఓసీ కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఓసీల జనాభా 22 శాతం ఉంటుందని, ఇందులో సయ్యద్, పఠాన్ లు ఉన్నారని చెప్పారు. ఓసీలకు నేటికీ రాజకీయ రిజర్వేషన్లు లేక తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాల్లో సైతం ఎదుటివారి ఆర్థిక అంగ బలం ముందు ఓసీ అభ్యర్థులు సరితూగ లేక జనరల్ స్థానాల్లో కనీసం 20 శాతం సీట్లు కూడా గెలుచుకోలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్లు ఓసీలకు కూడా కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఓసీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు విద్యా, ఉద్యోగ పోటీ పరీక్షలలో వయోపరిమితిని పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
