కుర్రాళ్లకు కఠిన పరీక్ష..ఇవాళ భారత్, లంక తొలి వన్డే

కుర్రాళ్లకు కఠిన పరీక్ష..ఇవాళ భారత్, లంక తొలి వన్డే


ఐపీఎల్‌‌‌‌లో కరోనా కలకలం తర్వాత.. ఇంటా బయటా క్వారంటైన్‌‌‌‌లు పూర్తి చేసుకున్న యంగ్‌‌‌‌ టీమిండియా.. ఎట్టకేలకు వైట్‌‌‌‌బాల్‌‌‌‌ యాక్షన్‌‌‌‌కు రెడీ అయ్యింది. 77 రోజుల లాంగ్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ తర్వాత ఆదివారం తొలిసారి కాంపిటేటివ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడనుంది.  శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌ కెప్టెన్సీలోని ఇండియా జట్టు.. నేడు జరిగే తొలి వన్డేలో శ్రీలంకతో తలపడనుంది.  టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కు డ్రెస్‌‌‌‌ రిహార్సల్‌‌‌‌గా భావిస్తున్న ఈ సిరీస్‌‌‌‌ను ఇరు జట్లు ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నాయి. అయితే, కొత్తగా టీమ్‌‌‌‌లో చేరిన కుర్రాళ్లు.. మెగా ఈవెంట్‌‌‌‌లో ఆడే చాన్సే  కొట్టేయాలనే లక్ష్యంతో లంక సిరీస్‌‌‌‌పై దృష్టిపెట్టారు. టాప్‌‌‌‌ ప్లేయర్లు లేకపోయినా సొంతగడ్డపై ఆడనుండటం లంకకు అడ్వాంటేజ్‌‌‌‌ అయినా.. ఐపీఎల్‌‌‌‌ హీరోలతో నిండిన ఇండియానే ఈ మ్యాచ్‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది.  కెప్టెన్‌‌‌‌గా శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌ సక్సెస్‌‌‌‌ అవుతాడా... కుర్రాళ్లు అదరగొడతారా.. హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌ను అడ్డుకుని టూర్‌‌‌‌లో బోణీ కొడతారా .. చూడాలి. 

కొలంబో: అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియా, శ్రీలంక సిరీస్‌‌‌‌కు సమయం ఆసన్నమైంది. హోమ్‌‌‌‌ టీమ్‌‌‌‌లో కరోనా కేసులు వెలుగు చూడటంతో.. ఐదు రోజులు ఆలస్యంగా ఈ సిరీస్‌‌‌‌ను మొదలుపెడుతున్నారు. దీంతో ప్రేమదాస స్టేడియంలో ఇరుజట్ల మధ్య ఆదివారం జరిగే ఫస్ట్‌‌‌‌ వన్డేతో సిరీస్‌‌‌‌కు తెరలేవనుంది. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ నేపథ్యంలో రెండు జట్లు ఈ సిరీస్‌‌‌‌కు చాలా ప్రాధాన్యమిస్తున్నాయి. సిరీస్‌‌‌‌ గెలిచి కాన్ఫిడెన్స్‌‌‌‌ను పెంచుకోవాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకున్నాయి. అయితే ఇరుజట్లలో కుర్రాళ్లు మంచి జోరుమీదుండటం, కొత్త కెప్టెన్లుగా ధవన్‌‌‌‌, షనక.. టీమ్స్‌‌‌‌ను ఎలా నడిపిస్తారన్న ఆసక్తి మొదలైంది. 

ఫైనల్‌‌‌‌ ఎలెవెన్‌‌‌‌లో ఎవరు ?

టీమిండియా సీనియర్‌‌‌‌ రెగ్యులర్‌‌‌‌ ప్లేయర్లు లేకపోవడంతో.. ఈ సిరీస్‌‌‌‌ కోసం ఎక్కువగా యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌నే తీసుకున్నారు. దీంతో ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌ ఎలా ఉంటుందన్నది చూడాలి. కెప్టెన్‌‌‌‌ శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌, వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ భువనేశ్వర్‌‌‌‌ కుమార్‌‌‌‌, ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా స్థానాలు ఖాయం కాగా.. మిగిలిన ఎనిమిది ప్లేస్‌‌‌‌లను భర్తీ చేయాల్సి ఉంది. ప్రతీ స్థానానికి మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ముందు రెండు, మూడు ఆప్షన్లు ఉన్నాయి.  అయితే, త్వరలో టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ జట్టు ఎంపిక ఉండటంతో ఈ సిరీస్  ద్వారా కొన్ని ముఖ్యమైన స్లాట్స్‌‌‌‌కు ప్లేయర్లను సిద్ధం చేయాలని మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ భావిస్తోంది. అందువల్ల టీమ్‌‌‌‌ ఎంపికలో రెగ్యులర్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ, కోచ్‌‌‌‌ రవిశాస్త్రి సూచనలు పాటించడం ఖాయం. ఈ నేపథ్యంలో మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఎవరికి చాన్స్‌‌‌‌ ఇస్తుందనేది ఆసక్తికరం.  ప్రస్తుతానికైతే ధవన్‌‌‌‌,  పృథ్వీ షా ఓపెనర్లుగా రానున్నారు. అయితే యూఏఈలో జరిగే టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో వీరిద్దరికీ చాన్స్‌‌‌‌ దొరక్కపోవచ్చు. కోహ్లీ, కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌లో ఒకరు రోహిత్‌‌‌‌తో కలిసి మెగా ఈవెంట్‌‌‌‌లో ఓపెనర్లుగా వస్తారని జట్టు వర్గాలు కొంతకాలంగా చెబుతున్నాయి. దేవదత్‌‌‌‌ పడిక్కల్‌‌‌‌, రుత్‌‌‌‌రాజ్‌‌‌‌ గైక్వాడ్‌‌‌‌లో ఒకరికి ఈ మ్యాచ్‌‌‌‌లో చాన్స్‌‌‌‌ ఇస్తారేమో చూడాల్సి ఉంది.  సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌, మనీశ్‌‌‌‌ పాండే బరిలోకి దిగడం దాదాపు ఖాయం. ఇక, అన్నింటికంటే ముఖ్యంగా వికెట్‌‌‌‌ కీపింగ్‌‌‌‌ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారో చూడాల్సి ఉంది. ఈ ప్లేస్‌‌‌‌ కోసం సంజు శాంసన్‌‌‌‌,  ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ రేసులో ఉన్నారు. వీరిద్దరూ ఐపీఎల్‌‌‌‌లో తమ సత్తాను ఆల్రెడీ ప్రూవ్‌‌‌‌ చేసుకున్నారు. అయితే, వన్డే ఫార్మాట్‌‌‌‌ కావడంతో కోచ్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌, కెప్టెన్‌‌‌‌ ధవన్‌‌‌‌ ఎవరికి ఓటేస్తారో చూడాల్సి ఉంది.

బౌలింగ్‌‌‌‌ స్ట్రాటజీ ఎలా..

ఈ మ్యాచ్‌‌‌‌లో ఇండియా ఎలాంటి వ్యూహంతో బరిలోకి దిగుతుందనే దానిపై  మిగిలిన స్థానాల ఎంపిక ఆధారపడి ఉంటుంది. లంకలో వికెట్లు సహజంగా స్పిన్‌‌‌‌కు అనుకూలిస్తాయి. అందువల్ల ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగవచ్చు.  మిడిలార్డర్‌‌‌‌లో హార్దిక్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ ఖాయం కాగా.. మిగిలిన ప్లేస్‌‌‌‌ కోసం  లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్లు క్రునాల్‌‌‌‌ పాండ్యా, కృష్ణప్ప గౌతమ్‌‌‌‌ మధ్య కూడా గట్టి పోటీ ఉంది. ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌గా తన సత్తా ఏంటో క్రునాల్‌‌‌‌ ఇప్పటికే ప్రూవ్‌‌‌‌ చేసుకోగా.. ఆఫ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ అయిన గౌతమ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌లో  కూడా రాణించగలడు. రెగ్యులర్‌‌‌‌ స్పిన్నర్ల కోటాలో మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ముందు చాలా ఆప్షన్లున్నాయి. సీనియర్లు యజ్వేంద్ర చహల్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌తోపాటు వరుణ్‌‌‌‌ చక్రవర్తి, రాహుల్‌‌‌‌ చహర్‌‌‌‌ జట్టుతో ఉన్నారు. చహల్‌‌‌‌, కుల్దీప్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో లేరు. కాబట్టి యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇస్తారేమో చూడాలి. భువీతో కలిసి దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ పేస్‌‌‌‌ అటాక్‌‌‌‌ను నడిపించడం దాదాపు ఖాయం. మూడో పేసర్‌‌‌‌ కావాలనుకుంటే నవదీప్‌‌‌‌ సైనీ,  యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ చేతన్‌‌‌‌ సకారియా  అందుబాటులో ఉన్నారు. 

పిచ్‌‌‌‌/ వాతావరణం

ప్రేమదాసలో 2019లో చివరిగా వన్డే జరిగింది. ఈ మ్యాచ్​లో భారీ స్కోరుకు చాన్సుంది. వాతావరణం సాధారణంగా ఉండనుంది. కానీ గాల్లో తేమ ప్రభావం చూపవచ్చు. వర్షం కురిసే అవకాశం కూడా ఉంది.

అంచనాల్లేని లంక..

సొంతగడ్డపై ఆడుతున్నప్పటికీ దసన్‌‌‌‌ షనక కెప్టెన్సీలోని శ్రీలంక టీమ్‌‌‌‌ ఈ మ్యాచ్‌‌‌‌లో ఎలాంటి అంచనాల్లేకుండా బరిలోకి దిగుతోంది. పైగా, ఈ సిరీస్‌‌‌‌కు ముందు ఇంగ్లండ్‌‌‌‌లో పర్యటించిన లంక.. అక్కడ  మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో చిత్తుగా ఓడింది. దీంతో ఆ జట్టు కొంత ఒత్తిడిలో ఉండనుంది.  పతుమ్‌‌‌‌ నిసంకా టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌లో కీలకం కానున్నాడు. కుశాల్‌‌‌‌ పెరీరా, గుణతిలక, నిరోషన్‌‌‌‌ డిక్‌‌‌‌వెల్లా లేకపోవడంతో నిసంకా ఇన్నింగ్స్‌‌‌‌ ఓపెనింగ్‌‌‌‌ చేయనున్నాడు..  ఇప్పటిదాకా తొమ్మిది వన్డేలాడిన నిసంకా.. జట్టులో తన ప్లేస్‌‌‌‌ను సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నాడు. ఆల్‌‌‌‌ రౌండర్లు  ధనంజయ లక్షన్‌‌‌‌,  బానుక రాజ పక్స, మిడిలార్డర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ అషేన్‌‌‌‌ బాంద్రా రూపంలో బ్యాటింగ్‌‌‌‌లో ఆ జట్టుకు మంచి ఆప్షన్స్‌‌‌‌ ఉన్నాయి.ఇక, వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ మినోద్‌‌‌‌ భానుక తమ బ్యాటింగ్‌‌‌‌ లైనప్‌‌‌‌లో నిలకడ తీసుకొస్తాడని లంక మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ భావిస్తోంది. పేసర్‌‌‌‌ కుశాన్‌‌‌‌ రజిత ఈ మ్యాచ్‌‌‌‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. 

జట్లు (అంచనా)
ఇండియా : శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), పృథ్వీ షా, సూర్యకుమార్‌‌‌‌, మనీశ్‌‌‌‌ పాండే, ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (కీపర్‌‌‌‌), హార్దిక్‌‌‌‌ పాండ్యా, క్రునాల్‌‌‌‌ పాండ్యా, భువనేశ్వర్‌‌‌‌, సైనీ/చహర్‌‌‌‌,  కుల్దీప్‌‌‌‌/ వరుణ్‌‌‌‌/ చహర్‌‌‌‌, చహల్‌‌‌‌.
శ్రీలంక : అవిష్క ఫెర్నాండో, నిసంకా, భానుక (కీపర్‌‌‌‌), ధనంజయ డిసిల్వా, రాజపక్స, షనక (కెప్టెన్‌‌‌‌), హసరంగ, ఇసురు ఉడాన, సందాకన్‌‌‌‌, చమీరా, రజిత