ODI World Cup 2023: సినిమాల్లోకి వచ్చేయ్.. వార్నర్‌‌కు బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్

ODI World Cup 2023: సినిమాల్లోకి వచ్చేయ్.. వార్నర్‌‌కు బర్త్ డే విషెస్ తెలిపిన అల్లు అర్జున్

డేవిడ్ వార్నర్.. ఇతన్ని ఆస్ట్రేలియా ఓపెనర్ అనడం కంటే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ క్రికెటర్ అనడం ఉత్తమం. ఐపీఎల్ టోర్నీ వల్ల తెలుగు అభిమానులకు అంతలా దగ్గరయ్యాడు.. మన వార్నర్. ప్రస్తుతానికి అతను ఎస్‌ఆర్‌హెచ్ తో తెగతెంపులు చేసుకున్నా మనోడి కిందే లెక్క. వార్నర్‌పై తెలుగు క్రికెట్ అభిమానుల ప్రేమ అటువంటిది. 

అందునా వార్నర్‌కు తెలుగు నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఎనలేని అభిమానం. అతని సినిమాలన్నా, అతని సినిమా విశేషాలన్నా మహా ఇష్టం. అంతేకాదు అల్లు అర్జున్ తరహాలో స్పూఫ్ వీడియోలు చేస్తుంటాడు. అతని సోషల్ మీడియా ఖాతాలో అలాంటి వీడియోలు ఎన్నో కనిపిస్తాయి. ఇక భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో అతని సెలెబ్రేషన్స్ మరో లెవెల్. సెంచరీ చేసిన ప్రతిసారీ 'నీయవ్వ తగ్గేదే లే' అంటూ గడ్డం కిందికి చేయి పోనిస్తూ పుష్ప రాజ్‌ను గుర్తుచేస్తున్నాడు. తనను ఇంతలా అభిమానించే వార్నర్‌కు బన్నీ  సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 

నేడు (అక్టోబరు 27) డేవిడ్ వార్నర్ పుట్టినరోజు. 37వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ క్రమంలో అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా వార్నర్ కు బర్త్ డే విషెస్ తెలిపాడు. "క్రికెట్ సూపర్ స్టార్ డేవిడ్ వార్నర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి సంతోషదాయక పుట్టిన రోజులు మీరు మరెన్నో జరుపుకోవాలి. మీరు కోరుకున్నవన్నీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.." అని బన్నీ తన ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. ఇదిలావుంటే వార్నర్‌ను తెలుగు అభిమానులు సినిమాల్లో నటించమని కోరుతున్నారు. తనకు ఇష్టమైన బన్నీ సినిమాలో ఒక పాత్రైనా చేయొచ్చు కదా! అని విజ్ఞప్తి చేస్తున్నారు.

అద్భుతమైన ఫామ్ 

వన్డే ప్రపంచ కప్ లో మంచి ఫామ్ కనబరుస్తున్నాడు. ఆడిన ఐదు మ్యాచ్ ల్లో రెండు సెంచరీలు(332 పరుగులు) చేశాడు. ప్రస్తుతం వార్నర్ అత్యధిక పరుగుల ఆటగాళ్లలో 3వ స్థానంలో ఉన్నాడు.