మురుగు నీటిలోనే స్నానాలు: ధర్మపురి వద్ద గోదావరి దుస్థితి

మురుగు నీటిలోనే స్నానాలు: ధర్మపురి వద్ద గోదావరి దుస్థితి

రేపటి నుంచి లక్ష్మీనరసింహుని  బ్రహ్మోత్సవాలు
 ఎప్పటిలాగే ఈసారీ  భక్తులకు తప్పని ఇబ్బందులు
 ఏండ్లుగా డ్రైనేజీ గోదావరిలో కలుస్తున్నా పట్టించుకోని ఆఫీసర్లు

జగిత్యాల/ధర్మపురి, వెలుగు:దక్షిణ వాహినిగా పేరుగాంచిన ధర్మపురి గోదావరి నది కలుషితమవుతూనే ఉంది. భక్తులు పుణ్య స్నానాలు ఆచరించే జలాలు మురుగును తలపిస్తున్నాయి. టౌన్​లోని డ్రైనేజీ వ్యర్థాలు నేరుగా నదిలో కలవడమే ఇందుకు కారణం. ఇంత జరుగుతున్నా అధికారులు ప్రత్యామ్నాయం చూడట్లేదు. మురుగును మళ్లించేందు చర్యలు చేపట్టి మధ్యలోనే ఆపేశారు. ఫలితంగా పవిత్ర గోదావరి నది పొల్యూట్​అవుతూనే ఉంది. ఈ నెల 24 నుంచి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు స్టార్ట్​ కానున్నాయి. స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు మొదట నదిలో స్నానం చేయడం ఆనవాయితీ. ఇప్పుడున్న నీళ్లలోకి దిగితే ఎలాంటి రోగాలు అంటుకుంటాయోనని భక్తులు భయపడుతున్నారు. 
పుష్కరాలప్పుడూ ఇంతే..
జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి నది దక్షిణ వాహినిగా ప్రవహించడం ఓ ప్రత్యేకతగా చెప్పుకుంటారు. దక్షిణ కాశీ, తీర్థ రాజం, హరిహర క్షేత్రంగా ఈ ప్రాంతం ఫేమస్. అయితే ధర్మపురి టౌన్​లోని మురుగు నీటిని మున్సిపల్​అధికారులు నేరుగా గోదావరిలోకి వదులుతున్నారు. దీనికితోడు ధర్మపురి దాకా ఎల్లంపల్లి ప్రాజెక్ట్​ బ్యాక్​వాటర్ స్టోర్​ అవుతోంది. ఈ జలాల్లోకి మురుగు చేరుతుండడంతో పొల్యూట్​అవుతున్నాయి. వన్యప్రాణులు ఈ నీటిని తాగి చనిపోతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నదుల ప్రక్షాళన కోసం రూ.కోట్లు ఖర్చు చేస్తుంటే ఇక్కడ పరిస్థితి వేరేగా ఉంది. ఆఫీసర్లు, అధికార పార్టీ నేతలు నిర్లక్ష్యం చేస్తూనే ఉన్నారు. డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం చూడకుండా నేరుగా గోదావరిలో కలుపుతూ కాలుష్య కోరల్లోకి నెట్టేస్తున్నారు. నదీ తీరంలో పందులు స్వైర విహారం పెరిగింది. భక్తులు మొక్కుల పేరుతో  జంతు బలులు నిర్వహించడంతో మరింత అపరిశుభ్రంగా మారింది. 2015లో గోదావరి పుష్కరాలు జరిగాయి. అప్పుడు కోట్లాది మంది భక్తులతోపాటు వీవీఐపీలు, మంత్రులు, పలువురు స్వామిజీలు సైతం ఈ మురుకి నీటిలోనే పుష్కర స్నానం చేశారు. ఏండ్లుగా కాలుష్యం 
పెరిగిపోతున్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా గోదావరిలో సీవరేజ్​ట్రీట్​మెంట్ ప్లాంట్ ఏర్పాటు చేసి నదిని క్లీన్​ చేయించాలని స్థానికులు కోరుతున్నారు. 24వ తేదీ నుంచి ఏప్రిల్​5 వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఇక్కడికి వచ్చే భక్తులు కొవిడ్​రూల్స్​ను ఫాలో అవ్వాలని ఆలయ అధికారులు సూచించారు. 25న స్వామి వారి కల్యాణం మొదలుకొని డోలోత్సవాలు, తెప్పోత్సవాలు, ఏప్రిల్ 5న రథోత్సవం కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. అయితే ధర్మపురి క్షేత్రాన్ని యాదాద్రి, వేములవాడ మాదిరి టెంపుల్ సిటీగా రూపొందిస్తామని, అన్ని రకాలుగా డెవలప్​చేస్తామని సీఎం కేసీఆర్ గతంలో హామీ ఇచ్చారు. ఇందుకోసం రూ.100 కోట్లు ఇస్తామని ప్రకటించారు. ఇంతవరకు అతీగతి లేదు.

రోగాలు వచ్చేట్టున్నయ్​
గోదావరి నది స్నానం కోసం జన్నారం నుంచి వచ్చినం. ఇక్కడి నీళ్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నయ్. ఊళ్లోని మురుగంతా నదిలోకి చేరుతోంది. తప్పక ఇందులోనే స్నానం చేశాం. రోగాలు వస్తాయోమోనని భయంగా ఉంది.
‑ అమర్, భక్తుడు, జన్నారం 

మున్సిపల్ వాళ్లతో చర్చిస్తం
గోదావరిలోకి మురుగు నీరు వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం పనులు ఆగిపోయాయి. నరసింహుని బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఉండేలా చూస్తాం. మున్సిపల్ అధికారులతో చర్చిస్తాం.
‑ శ్రీనివాస్, ఆలయ ఈవో, ధర్మపురి