బాలుడిపై అఘాయిత్యం నిజమే.. సైదాబాద్ బాలసదన్ కేసులో సంచలన విషయాలు

బాలుడిపై అఘాయిత్యం నిజమే.. సైదాబాద్ బాలసదన్ కేసులో సంచలన విషయాలు

మలక్ పేట, వెలుగు: సైదాబాద్‎లోని చైల్డ్ అబ్జర్వేషన్ హోమ్‎లో 13 ఏండ్ల బాలుడిపై అఘాయిత్యం చేసిన పర్యవేక్షకుడు రెహమాన్ (30)పై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. దసరా సందర్భంగా ఇంటికి వెళ్లిన బాధిత బాలుడు తల్లిదండ్రులకు విషయం చెప్పగా, వారు బాలల సంరక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో బాలల సంరక్షణ కమిటీ ఆదేశాలతో సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడు రెహమాన్‌‌‌‌‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు. 

బాలల సంరక్షణ కమిటీకి నివేదిస్తాం

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ బాలుర పర్యవేక్షణ గృహంలో సోమవారం దర్యాప్తు చేపట్టాం. 13 ఏండ్ల బాలుడిపై అబ్జర్వేషన్ స్టాఫ్ గార్డ్ రెహమాన్ కొద్ది కాలంగా అసహజరీతిలో లైంగిక దాడికి పాల్పడిన్నట్లు విచారణలో తెలింది. ఇతర బాలుళ్లపై కూడా లైంగిక దాడి జరిగిందా అనే కోణంలో కూడా విచారణ జరిపాం. కానీ ఒకే బాలుడిపై జరిగినట్లు తెలిసింది. నివేదికను ఉన్నతాధికారులతో పాటు బాలల సంరక్షణ కమిటీకి ఇస్తాం. నిందితుడిపై కఠినమైన చర్యలు ఉంటాయి.

–  మైథిలీ, దర్యాప్తు అధికారి, మహిళా సూపరిటెండెంట్

ఫిర్యాదు బాక్స్‎లు ఏర్పాటు చేస్తాం 

జువైనల్ హోమ్‎లో ఇలాంటి ఘటన దురదృష్టకరం. ప్రస్తుతం ఒకే బాలుడిపై లైంగిక దాడి జరిగినట్లు అధికారులు ధ్రువీకరించారు. బాధిత బాలుడి ముగ్గురి స్నేహితులను సాక్ష్యం కోసం భరోసా సెంటర్‎కు తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఫిర్యాదు బాక్స్‎ను ఏర్పాటు చేస్తాం. ప్రతి నెలా జ్యుడిషియల్, కౌన్సెలింగ్, మెడికల్ ఆఫీనర్లు అందుబాటులో ఉంటారు. ఏమైనా సమస్యలు ఉంటే వారికి చెప్పాలి.

–  సయ్యద్ అప్జల్, జువైనల్ హోం సూపరింటెండెంట్