కల్తీ అల్లం తయారీ కేంద్రంపై అధికారుల దాడులు

కల్తీ అల్లం తయారీ కేంద్రంపై అధికారుల దాడులు

హైదరాబాద్ లో ఎక్కడ చూసినా కల్తీ. ఏ ఆహార పదార్థాన్ని ముట్టుకున్నా..ఇది కల్తీయేమో అన్న సందేహం వస్తోంది. అంతలా అహార పదార్థాలను కొందరు దుర్మార్గులు కల్తీ చేస్తున్నారు. తాజాగా నాగారం మున్సిపాలిటీలో కల్తీ అల్లం పేస్ట్,  కల్తీ ధనియాల పొడి తయారీ కేంద్రంపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. 

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీలోని గాంధీ నగర్ కాలనీలో కుళ్లిపోయిన అల్లం పేస్ట్, ధనియాల పొడి తయారు చేస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. అల్లం పేస్ట్ లో జంతన్ గాం కలిపి, ధనియాల పొడిలో రేషన్ బియ్యం పొడిని కలిపి వీటిని తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు  కల్తీ గాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  168 కిలోల అల్లం పేస్ట్, 60 కిలోల రేషన్ బియ్యం, 30 కిలోల ధనియాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అల్లంపేస్ట్, ధనియాల పొడిని ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ తో విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉత్పత్తి ప్రక్రియలో అపరిశుభ్ర పరిస్థితులు, వ్యర్థ జలాలు, ప్రమాదకరమైన రసాయనాల వినియోగాన్ని కూడా పోలీసులు పసిగట్టారు.  ఈ కేసులో  గోపాల్, వెంకటేష్ లను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.