
అక్టోబర్ 16న గ్రూప్ -1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎగ్జామ్ ఏర్పాట్లపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పరీక్షకు వారం రోజుల ముందు https://www.tspsc.gov.in/ ద్వారా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన సూచించారు. మొత్తం 503 పోస్టులకు 3 లక్షల 80 వేల 202 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ స్థాయి పోస్టులు ఉండడంతో గ్రూప్-1 కు దరఖాస్తుల వెల్లువ కొనసాగింది. ఒక్కో పోస్టుకు సగటున 756 మంది పోటీ పడుతున్నారు.
జనవరి లేదా ఫిబ్రవరీలో గ్రూప్-1 మెయిన్స్ నిర్వహించే అవకాశమున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. గ్రూప్ -1 లోని 503 పోస్టుల్లో 225 మహిళలకు రిజర్వు అయ్యాయి. వీటికి 1,51,192 మంది దరఖాస్తు చేయగా.. ఒక్కో పోస్టుకు సగటున 672 మంది పోటీపడుతున్నారు. ఇక దివ్యాంగుల కేటగిరీలో గల 24 పోస్టులకు 6105 మంది దరఖాస్తు చేసుకోగా.. ఒక్కో పోస్టుకు 254 మంది పోటీలో ఉన్నారు. తెలంగాణ ఏర్పాటయ్యాక ఇదే మొదటి గ్రూప్-1 రిక్రూట్మెంట్ నోటిఫికేషన్.